https://oktelugu.com/

Ippasara : ఇక వైన్స్ లో ఇప్పసారా.. జనాలు తాగుతారా?

కాలక్రమంలో ఇప్పసారాను బ్రాండ్‌గా మలిచే ప్రయత్నం జరిగింది. 2018లో ‘డెస్మండ్‌జీ’ పేరుతో డెస్మండ్‌ నజారెత్‌ విప్పసారాను మార్కెట్లోకి తేగలిగారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 20, 2023 / 04:09 PM IST
    Follow us on

    Ippasara : సారా.. దశాబ్దాల నుంచీ గిరిజన సంస్కృతులతో ఈ పానీయానికి విడదీయరాని అనుబంధం ఉంది. అయితే, దీనిపై వలస పాలకులు నిషేధం విధించారు. తర్వాత మన పాలకులు కూడా వివిధ కారణాలతో దీనిపై నిషేధం అమలు చేస్తున్నారు. కానీ, మళ్లీ ఇప్పుడు దీనికి ప్రాచుర్యం లభిస్తోంది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పానీయాన్ని ఏకంగా వైన్స్‌లలో విక్రయించాలని నిర్ణయిచింది. మహువా పేరుతో ఇప్ప సారా అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. మధ్యప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా దీనిని సరఫరా చేయాలని భావిస్తోంది.

    రెండు సైజుల్లో..
    మాండ్‌ బ్రాండ్, మహువా వైన్‌ 180 ఎంఎల్, 750 ఎంఎల్‌ బాటిళ్లలో మార్కెట్‌లోకి విడుదల చేసింది. 180 ఎంల్‌ ధరను రూ.200, రూ.750 ఎంఎల్‌ బాటిల్‌ ధరను రూ.800 గా నిర్ణయించింది. ఆగస్టు 18న మధ్యప్రదేశ్‌ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌లోని బార్‌లకు దీనిని సరఫరా చేశారు. వైన్‌ షాపులలో కూడా అందుబాటులో ఉంది. అయితే బార్లలో పెగ్గు ధరను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

    ప్రభుత్వ ప్రోత్సాహంతో..
    ఈ ఏడాది జనవరిలో ఎంపీ ‘హెరిటేజ్‌ లిక్కర్‌’ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. అభిప్రాయాన్ని సేకరించేందుకు కొన్ని నెలల పాటు మధ్యప్రదేశ్‌ టూరిజం కార్పొరేషన్‌ బార్‌లలో నమూనా కోసం మహువా మద్యం అందించబడింది.

    గిరిజన సాధికారతలో భాగంగా..
    గిరిజన సాధికారత డ్రైవ్‌లో భాగంగా మహువా మద్యాన్ని స్థానికంగా తయారు చేస్తారు. గిరిజనుల ప్రాబల్యం ఉన్న దిండోరి, అలీరాజ్‌పూర్‌ జిల్లాల్లోని రెండు స్వయం సహాయక బృందాలు తయారు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మాండ్‌ అనే బ్రాండ్‌ పేరును సూచించిన వారు అలిరాజ్‌పూర్‌ ప్రజలు. పూర్తిగా గిరిజన సంప్రదాయం ప్రకారం.. ఎలాంటి ఇతర రసాయనాలు లేకుండా విప్ప పువ్వుతోనే ఈ సారా తయారు చేస్తారని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది.

    తూర్పు, పశ్చిమ, మధ్య ప్రాంత అడవుల్లో..
    విప్ప చెట్టుగా పిలిచే మధుక లాంగిఫోలియా చెట్లు భారత్‌లోని తూర్పు, పశ్చిమ, మధ్య ప్రాంత అడవుల్లో విస్తారంగా ఉన్నాయి. 3 వేల ఏళ్లుగా ఈ అడవుల్లో నివసిస్తున్న స్థానిక గిరిజన జాతులైన సంతాల్, గోండ్, ముండా, ఓరావోలు దీన్ని ‘జీవ వృక్షం’గా పిలుస్తారు. ఈ తెగలకు చెందిన గిరిజనులు విప్ప పువ్వులు, పండ్లు, కొమ్మలు, ఆకులు అన్నిటినీ ఆహారంగా, పశుగ్రాసంగా, ఇంధనంగా, మందులుగా ఉపయోగించేవారు. వస్తుమార్పిడి విధానం వాడుకలో ఉన్న అటవీప్రాంతాలలో దీన్ని కరెన్సీగానూ వినియోగించేవారు.

    నిషేధం విధించిన బ్రిటిష్‌ పాలకులు..
    ప్రాచీన కాలం నుంచి దాదాపు 19వ శతాబ్దం చివరి వరకు కిస్కు వంటి స్థానిక తెగలు ఈ విప్ప సారా వండడం, తాగడం, విక్రయించడానికి ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. అయితే, బ్రిటిషర్ల పాలనలో ఇలాంటి మద్యాన్ని నాటుసారాగా పరిగణిస్తూ ప్రజారోగ్యానికి, నైతికతకు ముప్పు కలిగించే ప్రమాదకర మత్తుపదార్థంగా పేర్కొన్నారు. బ్రిటిష్‌ పాలకులు 1878లో బొంబాయి అబ్కారీ చట్టం, 1892లో మౌరా చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాల ప్రకారం విప్పసారా తయారీతో పాటు విప్ప పూల సేకరణ, నిల్వపైనా నిషేధం విధించారు. ఫలితంగా రహస్యంగా తయారుచేయడం మొదలైంది. దీంతో నాణ్యత లోపించేది. అది విప్పసారా విషయంలో బ్రిటిష్‌ పాలకుల అజెండాకు మరింత బలం చేకూర్చింది. స్థానికంగా తయారుచేసే మద్యాన్ని నియంత్రించడం వల్ల బ్రిటన్, జర్మనీ నుంచి మద్యం దిగుమతులు పెరిగి ఆ ఆదాయం బ్రిటిష్‌ సైనిక విస్తరణకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడింది.

    స్వతంత్య్ర భారతంలోనూ..
    అయితే, 1947లో భారత్‌ స్వాతంత్య్రం సాధించిన తరువాత కూడా బ్రిటిష్‌ కాలం నాటి ఆర్థిక, సామాజిక విధానాలు మారలేదు. ‘వలస పాలనలో ఉన్నట్లుగానే మద్యం విక్రయాలు, ఉత్పత్తిపై ప్రభుత్వ గుత్తాధిపత్యమే కొనసాగింది. విప్ప సారాపై కఠిన ఆంక్షలూ యథాతథంగా కొనసాగాయి. అసలు మద్యం భారతదేశానికి బయట నుంచి వచ్చిన అలవాటని జాతీయవాదులు వాదించేవారు. వీటన్నిటి నేపథ్యంలో గిరిజనుల జీవితాలలో ముఖ్యమైన విప్ప సారా వంటివి సమస్యాత్మకంగా మారిపోయాయి.

    బ్రాండ్‌గా మలిచే ప్రయత్నం..
    అయితే, కాలక్రమంలో ఇప్పసారాను బ్రాండ్‌గా మలిచే ప్రయత్నం జరిగింది. 2018లో ‘డెస్మండ్‌జీ’ పేరుతో డెస్మండ్‌ నజారెత్‌ విప్పసారాను మార్కెట్లోకి తేగలిగారు. ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌(ఐఎంఎల్‌) కేటగిరీలో దీన్ని తయారుచేశారు. గోవాకు చెందిన క్రాఫ్ట్‌ డిస్టిలర్‌ ఈ విప్పసారాను కర్ణాటకలో విక్రయిస్తుంది. విప్పసారా నాటుసారా కాదు ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌(ఐఎంఎల్‌) అని గుర్తించిన రెండో రాష్ట్రం కర్ణాటక.

    ఐఎంఎల్‌ కేటగిరీలోకి మార్చి…
    దేశంలోని చట్టాల ప్రకారం ఒక రాష్ట్రంలోని దేశీయ మద్యాన్ని మరో రాష్ట్రంలో విక్రయించడం సాధ్యం కాదు కాబట్టి దీన్ని ఐఎంఎల్‌ కేటగిరీలో చేర్చడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ విక్రయించడానికి వీలు కలుగుతుంది. గత రెండేళ్లుగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. 2021లో మధ్యప్రదేశ్‌ విప్పసారాను వారసత్వ మద్యంగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక గిరిజన తెగలు విప్పపూలు సేకరించొచ్చు, నిల్వ చేసుకోవచ్చంటూ పాత చట్టాలలో మార్పులు తెచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ సంస్థ ‘అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డెవలప్మెంట్‌ అథారిటీ’ గిరిజనులు సేకరించి ఎండబెట్టిన విప్ప పూలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేసింది. తాజాగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బార్లు, వైన్స్‌ల్లో మాండ్‌ బ్రాండ్‌ పేరుతో విక్రయాలు ప్రారంభించింది.