Governor Vs Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఇప్పట్లో వివాదం ముగిసిపోయే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది బిల్లుల మీద ఆమె నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ఊరట కలగలేదు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల సంగతి తేల్చేశారు. అంతేకాదు ఆమె సొలిసిటర్ జనరల్ కు గవర్నర్ కార్యదర్శి సమాచారం అందజేశారు. నిజానికి శాసనసభలో ఆమోదించి పంపించిన బిల్లులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఆమోదించాలి. కానీ అందుకు నిర్దిష్ట గడువు మాత్రం లేదు. అధికరణలో “యాజ్ సున్ యాజ్ పాసిబుల్ ” అంటే “వీలైనంత త్వరలో” అనే వాక్యం ఉండడంతో సుదీర్ఘకాలంతోపాటు రాజభవన్ లో బిల్లులో పెండింగ్ లో పడిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ రాజ్ భవన్ వివరణ మాత్రం వేరుగా ఉంది. ప్రభుత్వం పంపిన రెండు బిల్లుల విషయంలో మాత్రం గవర్నర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. తన పరపతిని తగ్గించే బిల్లులను రూపొందించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
“ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు 2022” ను సెప్టెంబర్ లోనే ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే గవర్నర్ పరపతి తగ్గిపోతుందనే అభిప్రాయాలు రాజ్ భవన్ నుంచి వ్యక్తమవుతున్నాయి. అన్ని యూనివర్సిటీలోని పోస్టుల భర్తీకి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, గవర్నర్ కు పంపించింది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ కులపతిగా ఉంటారు. ఏదైనా వర్సిటీ కొత్త పోస్టులను భర్తీ చేస్తే ఆ వివరాలు గవర్నర్ కు పంపిస్తూ ఉంటుంది. గవర్నర్ వాటిని పరిశీలించి అనుమతి ఇస్తారు. సవరణలు, ఆరోపణలు ఉంటే గవర్నర్ కు రిక్రూట్మెంట్ ను నిలిపివేసే అవకాశాలుంటాయి. కానీ “కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్” ఏర్పడితే గవర్నర్ కు ఎలాంటి పరిశీలన అధికారులు ఉండవని రాజ్ భవన్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి బిల్లును రూపొందించడం పట్ల తమిళి సై నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. అందుకే బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించినట్లు సమాచారం. ఇక బిల్లులు రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే చాలా కష్టమని, ముందుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆగ్రహం గా ఉన్నాయి. ఇప్పటికే యూనివర్సిటీలో 2,500 వరకు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు అయితే ఈ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుందని అంటున్నాయి. ఇదే బిల్లును క్లియర్ చేయాలంటూ గతంలో కొన్ని విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ఎదుట నిరసన తెలిపేందుకు ప్రయత్నించాయి. ఇది ప్రభుత్వ ప్రోత్బలంతోనే జరిగిందని రాజ్ భవన్ వర్గాలు ఆరోపించాయి.
“అటవీ యూనివర్సిటీ బిల్లు” పైన గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం ఈ యూనివర్సిటీ కొత్తగా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీకి ఉపకులపతిగా ముఖ్యమంత్రిని నియమించడం పట్ల గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ యూనివర్సిటీ కైనా ఉపకులపతిగా గవర్నర్ ఉంటారు. కానీ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఛాన్స లర్ పోస్టులో సీఎంను పెడుతూ బిల్లును రూపొందించారు. ఆగ్రహించిన గవర్నర్.. ఈ బిల్లును కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. ఫలితంగా ఇది కూడా ఇప్పట్లో తేలదు అనే అభిప్రాయాలు ఉన్నాయి.
” దీ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ తో పాటు ది తెలంగాణ మున్సిపల్ లాస్ బిల్లు_2022″ పైనా గవర్నర్ ఆగ్రహంగా ఉన్నారు. మెడికల్, డెంటల్ కాలేజీలోని ప్రొఫెసర్ల పదవి విరమణ కాలాన్ని గతంలో 61 నుంచి 65 సంవత్సరాలకు పెంచారు. ప్రొఫెసర్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డీఎంఈలుగా నియమిస్తారు. జాతీయ వైద్య కమిషన్ నిబంధన ప్రకారం విభాగాధిపతులు 61 ఏళ్ల వరకే పని చేయాలి. అనంతరం తిరిగి ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం 65 సంవత్సరాల వరకు హెచ్ఓడీ లుగా కొనసాగిలా ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది. దీనిపై అనుమానం రావడంతో గవర్నర్ సంబంధిత మంత్రి హరీష్ ను వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన రాజ్ భవన్ వెళ్లి వివరణ ఇచ్చారు. అయినా బిల్లుకు ఆమోదం లభించలేదు. కొంతమంది వైద్య సంఘాల నేతలు గవర్నర్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అయినప్పటికీ గవర్నర్ దీనికి ఆమోదం తెలిపేందుకు ఇష్టపడటం లేదు. ఇక మునిసిపల్ బిల్లులో ప్రధానంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల అంశంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వీరి పదవి కాలం మూడేళ్లు పూర్తయితేనే సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుత చట్టంలో అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిని నాలుగు సంవత్సరాలకు పెంచింది. ఇది తమ హక్కులకు విఘాతమని, ఈ బిల్లును ఆమోదించవద్దంటూ గవర్నర్ కు కొంతమంది విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అందుకే ఆమె ఈ బిల్లును పెండింగ్ లో పెట్టారు. ఇక మూడు బిల్లులను ఆమోదించడం ప్రభుత్వానికి కొంత సానుకూల అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.