Rajahmundry TDP MLA: తెలుగుదేశం పార్టీలో(TDP) సీనియర్లు కినుక వహిస్తున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే నెపంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ తీరుతో పార్టీ నేతల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. దీంతో పార్టీ భవితవ్యం రసకందాయంలో పడినట్లయింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్లో ఉత్తేజం కన్నా నిస్తేజమే మిగులుతోంది. పార్టీ నేతల ఒంటెత్తు పోకడలతో పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నా వారిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. ఎవరెన్ని అనుకున్నా తామనుకున్నది చేసే తీరుతామని బాబు, యువ నేత లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary). చాలాకాలంగా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. బాబు, లోకేష్ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. వారి ఆధిపత్య ధోరణి మారాలని ఆకాంక్షిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు పార్టీ టికెట్ ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు సృష్టించడంతో ఆయన చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. రాజమండ్రి నుంచి మొత్తం ఆరుసార్లు బుచ్చయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇక ఎన్టీఆర్ హయాంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన పార్టీలో చేపట్టని పదవులు లేవంటే అతిశయోక్తి కాదు. పార్టీలో అంతలా ప్రాధాన్యమున్న నేతగా గుర్తింపు పొందిన బుచ్చయ్య చౌదరి కొద్ది కాలంగా పార్టీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే ఆయన నైజం. అందుకే ఆయనకు కొన్నిసార్లు మంత్రి పదవులు సైతం దక్కకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి.
పార్టీలో కొద్ది కాలంగా సీనియర్లకు పెద్దపీట వేయడం లేదు. ఫలితంగా పార్టీలో తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదు. దీంతో బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరుపై అందరిలో ఆగ్రహావేశాలు వస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు నేతలు కృషి చేయడం లేదనే అపవాదు మూట గట్టుకుంటున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ల ప్రాతినిధ్యం తగ్గిపోతోందనే ప్రచారం సాగుతోంది.
రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చిన బుచ్చయ్య చౌదరిని కాదని ప్రస్తుతం ఆదిరెడ్డి ని వెలుగులోకి తీసుకురావడంతో బుచ్చయ్యలో కోపం ఇంకా పెరిగిపోయింది. చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరుతో ఆయన మనసు కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కార్యక్రమాలకే కాకుండా రాజకీయాలకే స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాబు, లోకేష్ తీరుతో పార్టీకి పునర్వైభవం మాట ఎలా ఉన్నా భవితవ్యం మాత్రం వెనుకబడిపోయే ప్రమాదం పొంచి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా వారు మేల్కోకపోతే టీడీపీ నావ మునిగిపోవడం ఖాయమనే తెలుస్తోంది.