Godavari River- Krishna River: గోదావరి మహోగ్రం.. కృష్ణ దీనాతిదీనం

కృష్ణా నది పరివాహకంలో వర్షాలు కురవకపోవడం, ఎగువ ప్రాంతంలో కర్ణాటక విపరీతంగా ప్రాజెక్టులు నిర్మించడంతో మన ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కర్ణాటక దయ మీద ఆధార పడాల్సిన దుస్థితి నెలకొంది.

Written By: Bhaskar, Updated On : July 29, 2023 2:42 pm

Godavari River- Krishna River

Follow us on

Godavari River- Krishna River: గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కనివిని ఎరుగని స్థాయిలో వరద నీటితో తొణికిసలాడుతోంది. దెబ్బకు ఈ పరివాహకంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రమాదకరస్థాయిలో ఇన్ ఫ్లో ఉంటున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన కడెం ప్రాజెక్టు గేట్ల మీద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాలేశ్వరం ఎత్తిపోతల పథకం లోని అన్ని రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి, కాలేశ్వరం, ఇలా ఈ పథకం చూసుకున్నా వరద నీటితో కళకళలాడుతున్నాయి. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలు నీట మునిగేందుకు గోదావరి ప్రవాహం కూడా ఒక కారణమే. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక గోదావరి మాత్రమే కాకుండా కృష్ణానది ప్రవాహం కూడా అవసరమే. ఎందుకంటే రాష్ట్రానికి ఎంతో కీలకమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈ నదికి అనుసంధానమై ఉంది.. అయితే గోదావరి ఏరియాలో కురిసినట్టు కృష్ణా నది పరివాహకంలో వర్షాలు కురవకపోవడంతో ఈ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు మొత్తం వెలవెలబోతున్నాయి.

ఆశించినంత స్థాయిలో మాత్రం కాదు

నల్లమల్ల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం బ్యారేజ్ కి వరద నీరు వస్తున్నప్పటికీ అది ఆశించినంత స్థాయిలో మాత్రం కాదు. శ్రీశైలం నిండితేనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీరు వస్తుంది కాబట్టి..ప్రస్తుతానికి అయితే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ లోనే ఉంది. ఇక కృష్ణ నది పరివాహకంలో ముఖ్యంగా కర్ణాటకలోని తుంగభద్ర, ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ ఆ ప్రాంతంలో ఆశించినంత స్థాయిలో వర్షాలు కురవలేదు. ప్రస్తుతానికైతే జూరాలలో కూడా నీటి ప్రవాహం అంతంతమాత్రంగానే ఉంది. జూరాల ప్రాజెక్టు కనుక నిండితే ఆ వరద నీరు నాగార్జునసాగర్ డ్యాంకు చేరుకుంటుంది. కానీ జూరాల పరిధిలోనే విస్తారమైన వర్షాలు లేకపోవడంతో అక్కడ కూడా వరద మాత్రం గానే ఉంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీరే ఆధారం. ఈ ఏడాది సాగర్ పరిధిలో సరైన నీటి నిల్వలు లేకపోవడంతో రైతులు వానకాలం వరి నార్లు పోసుకోలేదు.. ఖరీఫ్ మొదట్లో వర్షాలు కూడా సరిగా కురకపోవడంతో ఆరుతడి పంటలు సాగు చేయలేదు. ప్రభుత్వ పరంగా కూడా సాగు సలహాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆశించినంత స్థాయిలో పంటలు సాగు చేయలేదు.

ఇక కృష్ణా నది పరివాహకంలో వర్షాలు కురవకపోవడం, ఎగువ ప్రాంతంలో కర్ణాటక విపరీతంగా ప్రాజెక్టులు నిర్మించడంతో మన ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కర్ణాటక దయ మీద ఆధార పడాల్సిన దుస్థితి నెలకొంది. ఒకవేళ కర్ణాటక నీళ్లు ఇవ్వకపోతే ఇక అంతే సంగతులు. గతంలో కృష్ణ నీళ్ళకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంతో చాలా గొడవలు జరిగాయి. అయినప్పటికీ ఆ రాష్ట్రం తీరు మారలేదు. ఎకో ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం ఉండటం, కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియా అక్కడే ఎక్కువ ఉండటంతో మనం ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్టు ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో కృష్ణానది నీళ్లకు సంబంధించి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు మోసులెత్తుతున్నాయి. అయితే వచ్చే ఈ వరద రైతుల అవసరాలు ఏ మేరకు తీరుస్తుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఈ సమయానికి ఈ రెండు ప్రాజెక్టులు నిండి ఉంటే ఖరీఫ్, రబీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇక జూలై మాసం ముగిసిన నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రాజెక్టులు నిండినప్పటికీ రైతులు నాట్లు వేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికే ఖరీఫ్ కాలం దాదాపు ముప్పావు వంతు పూర్తవుతుంది. అలాంటప్పుడు రైతులు కేవలం రబీ మీదే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది.

వరద వస్తోంది

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ప్రస్తుతానికి 2,25,830 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో నిల్. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 829 అడుగుల నీటిమట్టం ఉంది. ఇక నాగార్జునసాగర్ మొన్నటిదాకా డెడ్ స్టోరేజ్ లో ఉంది. ప్రస్తుతం వరదరావడంతో ప్రాజెక్టు కొంతమేర జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం నుంచి వరదలు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.