Ukraine indian students : యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లి వైద్య డిగ్రీలు పూర్తి చేయాల్సిన భారతీయ విద్యార్థుల దుస్థితికి అంతులేకుండా పోయింది. ఏడాదికిపైగా సాగుతున్న యుద్ధంతో తమ పరిస్థితి ఏంటో తెలియడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రమాదకర పరిస్థితులు ఉన్నా చదువు పూర్తి చేసేందుకు ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులకు అక్కడ స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. భారత్‌ను రష్యాకు మద్దతుదారుగా చూపుతూ తమను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ నుంచి ఈ శత్రుత్వం మరింత పెరిగిందని అక్కడికి వెళ్లిన విద్యార్థులు చెబుతున్నారు. తమ దేశం విడిచి వెళ్లాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏడెనిమిది నెలలుగా ఈ డిమాండ్ పెరుగుతోందని ఒక విద్యార్థి తెలిపాడు. దీంతో విద్యార్థులు తమ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి క్రమం తప్పకుండా లేఖలు రాస్తూ తమను వేరే దేశంలోని విశ్వవిద్యాలయాలకు బదిలీ చేయడానికి అనుమతించాలని కోరుతున్నారు.
18 వేల మంది స్వదేశానికి..
రష్యా దాడి తర్వాత 2022లో సుమారు 18 వేల మంది విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి ఖాళీ చేయించారు. వారు భారతీయ విద్యాసంస్థలు లేదా ఇతర విదేశీ విశ్వవిద్యాలయాలలో అధ్యయనాలను పునఃప్రారంభించవచ్చని ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో తమ చదువులు పూర్తి చేసేందుకు ఈ ఏడాది జనవరి నుంచి ఉక్రెయిన్‌కు వెళ్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3,400 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ డిగ్రీలు పూర్తి చేయడానికి తిరిగి వెళ్లారు.
నిబంధనలు ఆటంకం..
నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం, 2021, డిసెంబర్ తర్వాత విదేశాలలో చదువుతున్న విద్యార్థులు మరే ఇతర విశ్వవిద్యాలయానికి బదిలీ చేయలేరు. దీంతో విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసేందుకు తప్పనిసరి పరిస్థితిలో ఉక్రెయిన్‌కు వెళ్తున్నట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక విద్యార్థి తెలిపారు. యుద్ధం సాగుతున్న కొద్దీ, ప్రజల మూడ్ భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా మారుతోంది. ‘మీరు భారతీయులు.. రష్యాతో మంచి స్నేహితులు’ అని స్థానికులు తమ దేశం విడిచి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారని మరో విద్యార్థి తెలిపారు.
ఒకవైపు యుద్ధం, మరోవైపు వ్యతిరేకత..
ఒకవైపు రష్యా నుంచి కురుస్తున్న బాంబుల వర్షం, మరోవైపు స్థానికంగా పెరుగుతున్న వ్యతిరేకతతో తాము నిరంతరం భయంతో జీవిస్తున్నామని అక్కడికి వెళ్లిన భారతీయ విద్యార్థులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు దుకాణదారులు తమకు సరుకులు కూడా అమ్మడం లేదని పేర్కొంటున్నారు. హాస్టళ్లలోనూ వివక్ష ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కూడా అసభ్యంగా వ్యవహరిస్తునానరని ఓ విద్యార్థిని తెలిపింది. ఒక్కోసారి నీళ్లు ఉండడం లేదని, కరెంటు కట్ చేస్తున్నారని, వంటగది కూడా తెరుచుకోవడం లేదని కన్నీరు పెడుతున్నారు. ఎలా బతకాలో అర్థం కావడం లేదంటున్నారు.
సైరన్ మోగితే వణుకే..
ఇక యుద్ధం ప్రారంభం కాగానే సైరన్ మోగుతోందని, ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతునానమని పేర్కొంటున్నారు. భారతదేశంలో మా కుటుంబాలు కూడా ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారని తెలిపారు. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం స్పందించి తమను వేరే దేశంలోని విశ్వవిద్యాలయానికి బదిలీ చేయడానికి అనుమతించాలని వేడుకుంటున్నారు.