Radhe Shyam Movie Political Leaders AP: తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక అంశంలో పరిశ్రమలో గొడవలు సాగుతూనే ఉంటాయి. గతంలో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలతో ప్రభుత్వానికి సినిమాకు మధ్య అగాధం పెరిగిపోయింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ సినిమా పరిశ్రమపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. సినిమా టికెట్ల విషయంలో కలుగజేసుకుని ధరలు తగ్గించడంతో పరిశ్రమ వర్గాలకు జగన్ కు మధ్య దూరం పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కలుగజేసుకుని పెద్దన్న పాత్ర పోషించినా సమస్య కొలిక్కి రాలేదు. పవన్ కల్యాణ్ సినిమాలను టార్గెట్ చేసుకుంటూనే ఉండటం గమనార్హం. వకీల్ సాబ్ తో మొదలైన వివాదం భీమ్లా నాయక్ వరకు కొనసాగింది.
ప్రస్తుతం రాధేశ్యామ్ విడుదలతో మళ్లీ టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో పవన్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి ఓ సరికొత్త నినాదం తెరపైకి తెచ్చారు. విజయవాడలో విడుదలయ్యే ప్రతి సినిమాకు ప్రతి షోకు వంద టికెట్లు ఇవ్వాలని లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ నేతలు కూడా టికెట్లు కావాలని అడగడం ఇదే ప్రథమం. దీంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
Also Read: రివ్యూ : ‘రాధేశ్యామ్’
ఆ వంద టికెట్లకు డబ్బులు తామే చెల్లిస్తామని చెబుతున్నారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు టికెట్లు కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ నాయకులు టికెట్లు కావాలని కోరటం చూస్తుంటే వారు కూడా వినోదానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సింది పోయి సినిమాల టికెట్ల కోసం థియేటర్ల యాజమాన్యాలకు లేఖ రాయడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు వస్తున్నాయి.
కార్పొరేషన్ పరిధిలోని థియేటర్లలో విడుదలయ్యే సినిమాల టికెట్లు మాత్రమే కావాలని అడిగారు. దీంతో మేయర్ లేఖతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా అభిమానులు, సెలబ్రిటీలు టికెట్లు కావాలని అడగడం మామూలే. కానీ ఓ ప్రజాప్రతినిధి టికెట్లు కావాలని లేఖ రాయడంతో అందరు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. సమస్యలు వదిలేసి ఇలా సినిమాల వైపు మళ్లడం ఏమిటనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read: ఆర్ఆర్ఆర్ లో నన్ను ఎందుకు తీసుకోలేదు: ప్రభాస్ ప్రశ్నకు రాజమౌళి షాకింగ్ ఆన్సర్