ఇక అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. కేవలం హైటెక్ సిటీ ప్రాంతంలో కొన్ని ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు, మిగతా ప్రాంతంలో మరికొన్ని ఫ్లై ఓవర్లు నిర్మిస్తేనే అభివృద్ధి అంటే సరిపోతుందా? అసలు ప్రజలకి ఏమి కావాలి? అన్నింటికన్నా ముందుగా మంచినీటి సదుపాయం, మురుగునీటి పారుదల సదుపాయం, వరదనీరు నిలవకుండా కాలవలు, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించటం, ప్రజా రవాణా అందుబాటు, గుంటలు లేని రోడ్లు, ట్రాఫిక్ జాంలు లేని ప్రయాణం, వరదనీరు పోవటానికి అడ్డువచ్చే అక్రమకట్టడాల కూల్చివేత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. వీటిని అందించటంలో హైదరాబాద్ నగరపాలిక సంస్థ విజయవంత మయ్యిందా? ఇదే ప్రతిఒక్కరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ముఖ్యంగా విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన కెసిఆర్ గారు గుండెలమీద చేయి వేసుకొని విశ్వనగరం మాట దేవుడెరుగు పైన చెప్పిన కనీస సదుపాయాలు నెరవేరాయని చెప్పగలరా? ప్రజల్ని ఒకసారి మాయమాటలు చెప్పి మోసం చేయగలరు ఎల్లప్పుడూ చేయలేరు. మాట్లాడితే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పదే పదే మార్కెటింగ్ చేసుకోవటం తప్పించి ప్రజలకు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడరు. అయినా అదే దుర్గం చెరువు బ్రిడ్జి కింద ఘనంగా ప్రారంభించిన లేక్ వ్యూ పార్కులో ఉదయం పూట వాక్ చేస్తే తెలుస్తుంది దాంట్లోని డొల్లతనం. దుర్గంధపు వాసనలు పీల్చుకుంటూ వాకింగ్ చేయాల్సిన పరిస్థితి. హుస్సేన్ సాగర్ ని పరిశుభ్రం చేస్తామని చేసిన వాగ్దానం, మూసి నదిని సుందరంగా తయారుచేస్తామని చేసిన వాగ్దానం సరేసరి. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగటానికి వస్తారు మహాప్రభో. అవును మనకు ఇదేమీ కొత్తకాదు కదా.
కెసిఆర్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు
జి హెచ్ ఎంసి లో గెలవాలంటే గెలుపు రహస్యాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకున్నాడు. మొట్టమొదటిది మజ్లీస్ ని మచ్చిక చేసుకోవటం. అది కొత్తేమి కాదు. కాకపోతే వాళ్ళను మచ్చిక చేసుకోవటానికి వాళ్ళు పెట్టిన షరతులు ఒప్పుకోవటం. ఒకటి ఎన్నికలు ఇవిఎం ల తో కాకుండా బాలట్ పేపర్ తో నిర్వహించటం. ఎన్నికల కమీషన్ అందుకు ఒప్పుకోనేటట్లు చేయటం. ఇలా అయితేనే రిగ్గింగ్ కి అవకాశం వుంటుంది. ఇవిఎం లు పెట్టిన తర్వాత పాత బస్తీలో పోలింగ్ శాతం తగ్గింది. ఎందుకంటే రిగ్గింగ్ అవకాశాలు అందులో తక్కువ వుంటాయి కాబట్టి. అందుకే పట్టుబట్టి తెరాస-మజ్లీసులు బాలట్ పేపర్ ని తిరిగి ప్రవేశ పెట్టించు కోగలిగారు. రెండోది, డివిజన్ల పునర్వ్యస్తీకరణకు సమాధి పలకటం. ఎప్పటినుంచో పత్రికల్లో ప్రస్తుత డివిజన్ల వ్యవస్థ బాగోలేదు మారుస్తామని హామీ ఇచ్చి చివరకు పాత డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్ళటం. ఇది కూడా మజ్లీస్ ఒత్తిడికి తలొగ్గి తీసుకున్న నిర్ణయమే. ఇప్పుడున్న డివిజన్లు అశాస్త్రీయంగా వున్నాయని ఎంతోమంది మేధావులు చెప్పటం ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం తెలిసిందే. అయినా పాత బస్తీ లో కన్నా శివారుల్లో డివిజన్లు పెరుగుతాయని ఆ ప్రతిపాదనను అటకెక్కించటం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే. ఇక మూడోది, ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలనేది ఎన్నికల కమీషన్ కాకుండా ప్రభుత్వం నిర్ణయించాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం. ఇవన్నీ ఎలాగైనా జి హెచ్ ఎంసి లో గెలవాలని తీసుకున్న నిర్ణయాలే.
ఎవరు గెలుస్తారు?
ఇది అందరి మనసుల్ని తొలుస్తున్న ప్రశ్న. తెరాస-మజ్లీస్ లు తామే అధికారాన్ని కైవసం చేసుకుంటామని ధీమాగా వున్నాయి. అదేసమయంలో దుబ్బాక విజయంతో ఎలాగైనా మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని బిజెపి కలలు కంటుంది. ఇక కాంగ్రెస్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. కిందపడ్డా పైచేయి అని బిల్డ్ అప్ ఇవ్వటంలో సిద్ధహస్తులు. కానీ పరిశీలకులు మాత్రం పోటీ తెరాస-మజ్లీస్ బిజెపి ల మధ్యనే ఉంటుందని చెపుతున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు ఫలితం వీరి వైపే ఉంటుందని చెప్పటం అంటే కేవలం ఊహాగానమే అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, పార్టీల అభ్యర్ధుల పేర్లు వెల్లడైన తర్వాత, పార్టీల ప్రచార సరళి, ముందుకొచ్చే అంశాలు ఆధారంగా జనం నాడి ఆధారపడి వుంటుంది. ఇంతముందుగా అంచనా వేయటం గాలిలో పేకమేడలు కట్టినట్లే అవుతుంది. కాకపోతే ఇందులో కొన్ని మింగుడుపడని అంశాలు కనబడుతున్నాయి. అందులో మొదటిది, ఎక్స్ ఆఫిసియో సభ్యుల పాత్ర. 150 మంది కార్పోరేటర్ల తో పాటు ఈ ఎక్స్ ఆఫిసియో సభ్యులు కూడా కలిసి మేయర్ ని ఎన్నుకుంటారు. వీటి సంఖ్య ఎంతవుందో పూర్తిగా తెలియదు. జి హెచ్ ఎంసి పరిధిలోని ఎంఎల్యేలు, లోక్ సభ సభ్యులు, జి హెచ్ ఎంసి ని ఎంచుకున్న రాజ్య సభ సభ్యులు, ఎంఎల్ సి లు ఇందులో వుంటారు. ఈ సంఖ్య 50 కి దగ్గరలో వుంటుంది. అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. వీళ్ళలో ఎక్కువమంది తెరాస సభ్యులు. అంటే ఇక్కడ నగరవాసులు తక్కువమంది తెరాస కార్పోరేటర్లను ఎన్నుకున్నా మేయర్ గా తెరాస అభ్యర్దే ఎన్నికవుతాడు. ఒకవేళ తగ్గినా మజ్లీస్ ఎటూ కాపు కాస్తుంది. అంతకాడికి ఈ ఎన్నిక ఎందుకు? బూటకం కాదా?
ఉదాహరణకు ఇటీవల జమ్మూ-కాశ్మీర్ లోని 20 జిల్లాలకు జిల్లా అభివృద్ధి సమితి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అక్కడా ఇక్కడలాగానే ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధి సమితి లో ఎక్స్ ఆఫిసియో సభ్యులుగా వుంటారు. అభివృద్ధి ప్రణాలికల అమోదంలో వాళ్ళకూ ఓటు హక్కు వుంటుంది. కానీ చైర్మన్ ఎన్నికలో వాళ్లకు ఓటు హక్కు వుండదు. అదికూడా కేంద్ర చట్టాల ఆధారంగా రూపొందించిన చట్టమే. మరి ఇక్కడకి, అక్కడకి ఎందుకు తేడా వుంది. ప్రజాస్వామ్యాన్ని నీరు గార్చటానికే ఈ ఎక్స్ ఆఫిసియో సభ్యులకు ఓటు హక్కు కల్పించటం జరిగింది. ఈ నిబంధనని రద్దుచేయకుండా ఎన్నికలు నిర్వహించటం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయటమే అవుతుంది. రెండోది, ప్రస్తుత డివిజన్లను శాస్త్రీయంగా విభజించి అవసరమయితే సంఖ్యను పెంచి ఎన్నికలు నిర్వహించాలి. అవకతవకలు, లోపాలు వున్నాయని నిర్ధారణకు వచ్చినప్పుడు సమీక్ష చేయకపోవటం కూడా ప్రజాస్వామ్యాన్ని నీరుకార్చటమే అవుతుంది. అసలు మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలే సరైన పధ్ధతి. కానీ అది సాధ్యంకానప్పుడు కనీసం పై సూచనలను అమలుచేసైనా ఎన్నికలు నిర్వహిస్తేనే నిజమైన ప్రాతినిధ్య పద్దతిలో మేయర్ ఎన్నిక జరుగుతుంది. లేకపోతే ఈ ఎన్నికలు బూటకమే.