Gali Janardan Reddy : కొంతమంది వ్యవస్థలను ఇట్టే మేనేజ్ చేయగలరు. తమకు అనుకూలంగా మార్చేయగలరు. అటువంటి వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి( Gali Janardan Reddy). ఎటువంటి వ్యవస్థను అయినా లొంగ తీసుకోవడంలో నేర్పరి. బెయిల్ కోసం ఏకంగా న్యాయవ్యవస్థను ప్రలోభ పెట్టగలిగారు అంటే ఆయన ఎలా మేనేజ్ చేయగలడో ఇట్టే అర్థమవుతోంది. అయితే ఎట్టకేలకు సిపిఐ రంగంలోకి దిగడంతో గాలి జనార్ధన్ రెడ్డి పాపం పండింది. జనార్దన్ రెడ్డితో చేతులు కలిపిన న్యాయమూర్తులకు సరైన శాస్తి జరిగింది. అప్పట్లో బెయిల్ కుంభకోణంలో ఏకంగా న్యాయమూర్తులే అరెస్టు కావడం పెను సంచలనం గా మారింది.
Also Read : లోకేష్ కు కీలక పదవి.. మహానాడులో ప్రకటన!
* బెయిల్ కోసం రూ.5 కోట్ల ఆఫర్
గనుల అక్రమ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 2011 సెప్టెంబర్ 5న సిబిఐ( Central Bureau of Investigation ) ఆయనను అరెస్టు చేసింది. పక్కా ఆధారాలతో అరెస్టు చేయడంతో ఆయనకు న్యాయస్థానాల్లో బెయిల్ లభించలేదు. న్యాయమూర్తులు బెయిల్ తిరస్కరించడంతో.. చివరకు అడ్డదారిలో ప్రయత్నాలు మొదలు పెట్టాడు గాలి జనార్దన్ రెడ్డి. ఇందుకోసం సిబిఐ న్యాయమూర్తికే లంచం ఎరవేశాడు. ఐదు కోట్ల రూపాయలు ఇవ్వచూపాడు. 2012 జూన్ 11న హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి పట్టాభి రామారావు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నారు ఓబులాపురం మైనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఎస్పి ఖాన్. గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల చర్యలను గమనించారు. చురుగ్గా దర్యాప్తు చేపట్టారు. సిబిఐ జడ్జిలు పట్టాభి రామారావు, చలపతిరావు అడ్డంగా బుక్కయ్యారు. ఓ రౌడీ షీటర్ సహకారంతో ఐదు కోట్ల రూపాయల మొత్తం ఇవ్వడానికి గుర్తించారు సిబిఐ పోలీసులు. అలా వారి ఆట కట్టించారు.
* ఐదుగురు దోషులు..
అయితే తాజాగా ఓబులాపురం మైనింగ్ కేసులో( Obulapuram mining case ) నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురుని దోషులుగా, ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీ ఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడి రాజగోపాల్ దోషులుగా తేల్చింది. వారికి శిక్షలను కూడా ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ తో 3 వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడు అదే ఓబులాపురం మైనింగ్ కేసు ఉచ్చు ఆయనకే బిగుసుకుంది.