https://oktelugu.com/

Gaddar Funeral: డప్పు చప్పుళ్లు.. దరువుల మోతలు: అంతిమయాత్ర ఇంతకంటే గొప్పగా ఏముంటుంది?

గద్దర్‌ అంతిమయాత్రలో పొడుస్తున్న పొద్దు పాట ప్రధానంగా వినిపించింది. ఇదే సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు గద్దర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 7, 2023 7:01 pm
    Gaddar Funeral

    Gaddar Funeral

    Follow us on

    Gaddar Funeral: నీ చదువు, నీ డబ్బు, నీ పదవి, నీ భవంతి, ఇష్టపడి కట్టుకున్న బట్ట.. ఇలా ఏదీ నీవెంట రావు. ఉన్నంత సేపే ఈ ఆడంబరాలన్నీ. నిన్న అమీర్‌పేటలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్‌రావు అలియాస్‌ గద్దర్‌ కన్నుమూశారు. విప్లవస్ఫూర్తి, దీనజనుల ఆర్తి కలిసిన వ్యక్తి కాబట్టి సహజంగానే గద్దర్‌కు సబ్బండ వర్ణాలు నివాళులర్పించాయి. ప్రజా గొంతుకలు కన్నీరు పెట్టుకున్నాయి. రాజ్యం ఎలాగూ నివాళి ప్రకటించలేదు. 2:30 గంటల పాటు సాగిన అసెంబ్లీ ప్రసంగంలో, అధికారులు చెప్పినప్పటికీ కేసీఆర్‌ ఒక్క మాట కూడా గద్దర్‌ గురించి ప్రస్తావించలేదు. ఏదో చెప్పలేదూ అన్నట్టుగా ఒక ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. నివాళి అని ప్రకటించారు. అదేంటో తెలంగాణ కోసం కొట్లాడిన వారికి సొంత రాజ్యం నుంచి పరామర్శ కూడా దక్కడంలేదు. అదే ఆంధ్రా ప్రాంత వారికైతే రాజ లాంఛనాలు లభిస్తున్నాయి. కాకపోతే ఇది వేరే ముచ్చట.

    ముందుగానే చెప్పినట్టు గద్దర్‌ నిన్న కన్నుమూసినప్పటి నుంచి ఇవ్వాళ పాడె మీద పడుకోబెట్టి అంతియ యాత్ర చేసే దాకా ప్రజా గొంతకలు ఆయన వెంటే ఉన్నాయి. ఆయనను యాది చేసుకున్నాయి. ఎల్‌బీ స్టేడియం నుంచి అల్వాల్‌ దాకా సాగిన అంతిమయాత్ర గద్గదాన్ని నింపుకుంది. దుఃఖ చారికల మధ్య విమలక్క ఆడింది, పాడింది. కళాకారుల మాట గద్దర్‌తో తమకున్న అనుబంధాన్ని ప్రస్ఫుటీకరించింది. శ్రీకాకుళం నుంచి డప్పు కళాకారులు, కారంచేడు నుంచి దండోరా కార్మికులు.. నిజామాబాద్‌ నుంచి ఒగ్గు భగవత కారులు ఇలా ఒక్కరేమిటీ సబ్బండవర్ణాలూ అసైదుల్లా పాడాయి. కాళ్లకు గజ్జెలతో గమ్మతి చేశాయి. గద్దర్‌ అన్నా జోహార్‌ అంటూ నివాళి అర్పించాయి. రాజ్యం పట్టించుకోకపోయినా తమ కళాకారుడిని కాటికి సాగనంపాయి.

    గద్దర్‌ అంతిమయాత్రలో పొడుస్తున్న పొద్దు పాట ప్రధానంగా వినిపించింది. ఇదే సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు గద్దర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ముఖ్యంగా కారంచేడు నుంచి వచ్చిన వారు కన్నీరు పెట్టుకున్నారు. బషీర్‌ బాగ్‌ విద్యుత్‌ ఉద్యమంలో అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులు గద్దర్‌ చేసిన పోరాటాన్ని నెమరేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కాళ్లకు గజ్జె కట్టి ఆడినప్పటికీ, గొంతెత్తి పాడినప్పటికీ గద్దర్‌ కేసీఆర్‌ మనసు చూరగొనలేకపోయాడు. అది తెలంగాణ ఉద్యమం లోనూ, తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నరేళ్లు సాగింది.