Gadapa Gadapaku YCP: వైసీపీ సర్కారు ముచ్చగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది రెండు సంవత్సరాలే. అందులో చివరి సంవత్సరం ఎన్నికల సమయం. అందుకే ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల మధ్యలో ఉండాలని అధిష్టానం ఆదేశించింది. గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చింది. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఎంతెంత ఇచ్చింది. పథకాల గురించి ప్రచారం చేయాలని ఆదేశించింది. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ప్రజల నుంచి ఛీత్కారాలు, నిలదీతలు ఎదురవుతాయన్న ఆందోళన మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలను వెంటాడుతోంది. పథకాలయితే ఇచ్చాము కానీ.. అభివ్రద్ధి పనుల విషయంలో వెనుకబడిపోయామన్న భయం వారిని వెంటాడుతోంది. పైగా ఇన్నాళ్లూ పనిమీద వచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులకు నిధులు లేవు.. తామేమీ చేయలేమని స్థానిక ఎమ్మెల్యేలు సర్థి చెప్పి పంపేవారు. గ్రామాల్లో పనులకు ప్రత్యేక నిధులేవీ కేటాయించలేదు. పోనీ గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులు సైతం ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. చివరకు కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రతిపాదికన అందించిన ఆర్థిక సంఘ నిధులను సైతం ఖాతాల నుంచి మళ్లించింది. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో పారిశుధ్యం పనులు సైతం చేయించలేని స్థితిలో సర్పంచ్ లు ఉన్నారు. వారి సహకారంతోనే ఇప్పుడు గడపగడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా చేరువ కావాలని ప్రభుత్వం సూచించడంతో ఎమ్మెల్యేలు, మంత్రుల గొంతులో పచ్చి వెల్లక్కాయ పడినట్టయ్యింది. అటు పార్టీ కేడర్ సైతం ఏమంతా చరుగ్గా లేదు.
నేతల్లో నిర్వేదం
సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణంలో వారు నిండా మునిగిపోయారు. చాలా చోట్ల పనులు చేపట్టినా వారికి బిల్లులు చెల్లించలేదు. సచివాలయ భవన నిర్మాణం చేపట్టిన తాను వివాహ సమయంలో అత్తవారు ఇచ్చిన బంగారం కుదువ పెట్టుకోవాల్సి వచ్చిందని శ్రీకాకుళం జిల్లా అభివ్రద్ధి సమీక్షలో సాక్షాత్ అధికార పార్టీకి చెందిన ఎంపీపీ తన గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో నేను ఏకీభవిస్తున్నానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సదరు ఎంపీపీని సముదాయించారే తప్ప బిల్లులు త్వరలో వస్తాయని.. అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని కనీస హామీ ఇవ్వలేకపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
Also Read: Jagan Sketch On Chandrababu Arrest: చంద్రబాబును జైలుకు పంపేందుకు జగన్ భారీ స్కెచ్
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. పైస్థాయిలో ప్రజాప్రతినిధులకు కొంతవరకూ పర్వాలేకున్నా అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం చాలా నిరుత్సాహంతో ఉంది. పార్టీ కోసం అహర్నిషలు శ్రమిస్తే తమకు ఏంటీ పరిస్థితి అంటూ వారు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే చాలామంది పక్క చూపులు చూస్తున్నారు. ఇదే పరిస్థతి కొనసాగితే 2023 అక్టబోరు తరువాత ఇతర పార్టీల్లోకి భారీ వలసలు ఉంటాయన్న అనుమానం అధికార పార్టీ నాయకుల్లో సైతం ఉంది. క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు వేధిస్తున్న తరుణంలో అంతా సవ్యంగా ఉన్నట్టు అధిష్టాన పెద్దలు భావిస్తున్నారు. అందుకే గడపగడపకు టచ్ చేయాలని భావిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు గ్రామాల వైపు తొంగి చూసేందుకు భయపడిపోతున్నారు.
వెంటాడుతున్న సోషల్ మీడియా..
ప్రజల నుంచి పొరపాటున నిలదీత ఎదురైతే క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా శరవేగంగా వ్యాపిస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సోషల్ మీడియా హైప్ ద్వారా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. పేరుకే సచివాలయాలు కానీ.. ఒక విధులు, నిధులంటూ ఒకటి లేవు. పంచాయతీలు అయితే ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. మా వీధికి రహదారి వేయండి, పారిశుద్యంతో ఇబ్బంది పడుతున్నామంటే పంచాయతీల ఖాతాలో చిల్లిగవ్వలేని దుస్థితి. పోనీ స్థానిక ఎమ్మెల్యేకు చెప్పి స్పెషల్ గ్రాంట్ తెప్పించుకుందామంటే ‘మింగడానికి మెతుకు లేదు.. మీషాలకు సంపంగి నూనఎ’ అంటూ మాకే నిధులు లేవంటే మీకు ఎలా ఇస్తామన్న ప్రశ్న ఎమ్మెల్యేల నుంచి ఎదురవుతోంది., ఒక వేళ ఇద్దామన్నా మిగతా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్యూకడతారన్న భయం వెంటాడుతోంది. మరోవైపు ఎక్కడికక్కడే అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ ఎలాగోలా మేనేజ్ చేసుకొని వచ్చినా.. ఇప్పుడు నేరుగా వారి వద్దకు వెళ్లాల్సి వస్తోంది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఏ నాయకుడి వద్దకు వెళ్తే మిగతా వారు దూరమవుతారన్న బెంగ ఎమ్మెల్యేలకు వెంటాడుతోంది. అలాగని కార్యక్రమం నిర్వహించకపోతే అధిష్టానం సర్వేలో వెనుకబడిపోతామన్న భయం వేస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో గడపగడపకు వెళ్లడానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తెగ సంశయపడున్నారు.
Also Read:Jagan cousin arrest: సంచలనం.. ఏపీ సీఎం జగన్ కజిన్ అరెస్ట్.. అసలేం జరిగింది?
Recommended Videos: