Homeజాతీయ వార్తలుBJP 2024 Elections: బీజేపీ భవిష్యత్‌.. ఇక మోడీనే ఏదైనా చేయాలి!?

BJP 2024 Elections: బీజేపీ భవిష్యత్‌.. ఇక మోడీనే ఏదైనా చేయాలి!?

BJP 2024 Elections: భారతీయ జనతాపార్టీ.. తొమ్మిదేళ్లుగా అపజయం ఎరుగకుండా విజయ జైత్రయాత్ర సాగిస్తోంది. ఓటమెరుగని పార్టీగా దేశ రాజకీయాల్లో దూసుకుపోతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం తీరు.. అంతర్గత కలహాలు.. సారథ్య లోపం.. వంటి అంశాలు కూడా బీజేపీ జైత్రయాత్రకు పరోక్ష కారణం. అయితే అధికారం శాశ్వతం కాదన్నది సత్యం. ప్రస్తుతం దేశంలోని రాజకీయం పరిస్థితులు చూస్తుంటే అధికార మార్పు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ విషయంలో నిజం కావడానికి ఎంతో దగ్గరలో లేదని కర్ణాటక ఎన్నికల తర్వాత ఎక్కువ మంది అభిప్రాయపడతున్నారు. దీనికి ఎక్కువ మంది చెబుతున్న ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్సీకరణ కావడమే. దేశంలో బీజేపీ ప్రత్యేకంగా లేదని మరో కాంగ్రెస్‌ రూపమేనని కొన్నాళ్లుకాగ అవగతమవుతూనే ఉంది. కర్ణాటక ఎన్నికలతో ఆ కాంగ్రెస్‌ రూపం పతనం కూడా ప్రారంభమయింది. ఇక్కడ బీజేపీ అసలు సమస్య కాంగ్రెస్‌ ప్రధాన లక్షణాలు అయిన వ్యక్తి పూజ.. హైకమాండ్‌ పాలన.. ఒక నేతపై ఆధారపడటం వంటివి. అలాంటివి ఎప్పటికైనా కాళ్ల కిందకు నీరు తెస్తాయి. ఇప్పుడు బీజేపీకి అదే జరుగుతోంది. గతంలో ఏదైనా ఓ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీ పనైపోయిందని గతంలో ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఓడిపోతే అంత కంటే ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దీనికి సరైన ప్రాతిపదిక ఉంది మరి.

మోదీ ప్లాన్‌ ఫెయిల్‌..
2019లో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. జేడీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ కూటమి అధికారంలో ఉంది సీఎంగా కుమారస్వామి ఉన్నారు. రెండు పార్టీలు కలిసి అంతకు ము పోటీ చేసిన కొన్ని ఉపఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాయి. భారీ మెజార్టీలు వచ్చాయి. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే దుమ్మురేపడం ఖాయమనుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీలో పవర్‌ను కర్ణాటక ప్రజలు పెంచుతారని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. మొత్తం కర్ణాటకలో ఉన్న 28 పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీ 25 గెల్చుకుంది. మరోచోట సినీ నటి సుమలత ఇండిపెండెంట్‌గా బరిలోకి నిలబడితే బీజేపీ మద్దతు ఇచ్చింది. అంటే మొత్తం 28 పార్లమెంట్‌ స్థానాల్లో 26 బీజేపీకి దక్కాయి. రెండు మాత్రమే అందులో ఒకటి కాంగ్రెస్‌.. మరొకటి జేడీఎస్‌కు దక్కాయి. మొత్తంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే కాంగ్రెస్‌ జేడీఎస్‌ కూటమికి 170 స్థానాల్లో మెజార్టీ ఓట్లు వచ్చాయి. అంటే ఇతర పార్టీలు కూటమిగా కట్టినా బీజేపీకి ఏకపక్ష విజయం దక్కింది. అదే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నారు. జేడీఎస్, కాంగ్రెస్‌ విడివిడిగా పోటీ చేశాయి. రెండింటికీ కలిపి దాదాపుగా 160 సీట్లు వచ్చాయి. ఇక్కడ పొత్తుల్లేకుండానే బీజేపీపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఓటర్లు ఓట్లేశారు. అంటే.. భారత ప్రజాస్వామ్యంలో ఓటర్లు.. ఏ ఎన్నికలకు ఓట్లేస్తున్నామో చక్కగా గుర్తుంచుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. గుడ్డిగా వేసేయడం లేదు. ఆ విషయం కర్ణాటక ఎన్నికల ఫలితాలతో నిరూపితమయింది. అయితే ఇదేమీ గుర్తించకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ పాలకుడిగా తనకు ఉన్న ఇమేజ్‌ను కర్ణాటక ఎన్నికల్లో వాడేసుకోనాలని ప్రయత్నించారు. విçస్తృతంగా పర్యటించారు. తనను చూసి ఓటేయాలన్నట్లుగా విజ్ఞప్తులు చేశారు. స్థానిక అంశాలు తాను మాట్లాడితే అంత అతకదని.. పోలరైజేషన్‌ అంశాలనే టాపిక్స్‌గా తీసుకున్నారు. భజరంగ్‌ దళ్‌ నిషేధాన్ని.. ది కేరళ స్టోరీని.. తనను కాంగ్రెస్‌ నేతలు తిట్టిన విషయాన్ని ప్రచారాస్త్రాలుగా మార్చారు. ఇక్కడే మోదీ ప్లాన్‌ ఫెయిల్‌ అయింది.

అసెంబ్లీ ఎన్నికల గురించే ప్రజలు ఆలోచించారు..
కర్ణాటక ప్రజలు మోదీ ప్రచారం కన్నా.. తాము రాష్ట్ర అసెంబ్లీకి ఓట్లేస్తున్నామన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇక్కడ మోదీకి మొదటి వైఫల్యం.. అంతే కాదు.. భవిష్యత్‌లో ఆయన నేర్చుకోవాల్సిన చాలా కీలకమైన విషయాలను.. ఈ ఓటమి ఆయన ముందు పెట్టింది. ఇక బీజేపీ విషయంలో తానే ఏకైక స్టార్‌ క్యాంపెయినర్‌ అనే భావనను బలంగా వ్యాప్తి చేశారు. అదొకటే కాదు అలా చేయడం వల్ల ఓటముల ముద్ర తనపై పడతాయి. అయినప్పటికీ సాహసం చేశారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు వచ్చాయి.
హై‘కమాండ్‌’ పాలిటిక్స్‌తో ప్రమాదం..
కాంగ్రెస్‌లో ఇప్పటికీ హైకమాండ్‌ పాలిటిక్స్‌ కొనసాగుతున్నాయి. అదే ఆ పార్టీకి ప్లస్, మైనస్‌. ఇప్పుడు బీజేపీలోనూ ఆ సంస్కృతి కనిపిస్తోంది. మోదీ, అమిత్‌షా హైకమాండ్‌ అన్నట్లుగా పార్టీ పరిస్థితి తయారైంది. పార్టీలో మోదీ, షా పెత్తనం పెరిగిన తర్వాత.. చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కానీ ప్రజల్లో పాతుకుపోయిన నేతలను వేళ్లపై లెక్కించొచ్చు.

నేతలను ఎదగనీయకుండా..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ లాంటి వారికి ప్రజల్లో పలుకుబడి ఉంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ సీఎంకు జాతీయ స్తాయిలో పలుకుబడి ఉందో విశ్లేషిస్తే.. నేతల్ని మోదీ, షాలు ఎదగనీయలేదని అర్థం చేసుకోవచ్చు. పార్టీలో మోదీ కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు వారెవరికీ పార్టీలో ప్రాధాన్యత లేదు. బలమైన నేతలను ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేసేసిన మోదీ ఇప్పటికైనా వాస్తవం తెలుసుకోవాలి.

ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం. కాంగ్రెస్‌ హైకమాండ్‌.. రాష్ట్ర స్థాయిలో కీలక నేతల్ని ప్రజా నాయకులుగా ఎదగనిచ్చేందుకు అవకాశం కల్పించేది కాదు. నోరెత్తలేని నాయకుల్ని సీఎంలుగా చేసేవారు. కోపం వస్తే తప్పించేవారు. అయితే ఇలాంటి చర్యల వల్ల.. కాంగ్రెస్‌ బలహీనపడింది. కాంగ్రెస్‌ అనేక శాఖలుగా విడిపోయింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ బలహీనంగా ఉంది కానీ.. కాంగ్రెస్‌ అవశేష పార్టీలు మాత్రం బలంగా ఉన్నాయి. దీనికి కారణం హైకమాండ్‌ పాలిటిక్సే అని చెప్పాల్సిన పని లేదు. కళ్ల ముందు కాంగ్రెస్‌ పార్టీ దుస్థితి కనిపిస్తున్నా.. బీజేపీ, షాలు పార్టీపై పట్టు కోసం అదే ఫార్ములాను ప్రయోగించారు. ప్రయోగిస్తున్నారు. అందుకే వారికి ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. బీజేపీ ఈ పరిస్థితిని కవర్‌ చేసుకోకపోతే.. మరో కాంగ్రెస్‌గా మారడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular