JanaSena- TDP And BJP Alliance: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా 16 నెలల వ్యవధే ఉంది. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ, ఎలాగైనా అధికార పార్టీని మట్టికరిపించాలని టీడీపీ, జనసేనలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పొత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం మిస్టరీని తలపిస్తున్నాయి. ఎవరితో ఎవరు కలుస్తారు? ఏ పార్టీ నేతలు ఎక్కడకు జంప్ చేస్తారు? తటస్థులు ఏ పార్టీలో చేరుతారు? అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. 2023 సంక్రాంతి తరువాత ఒక్కో ప్రశ్నకు సమాధానం రానుంది. కొన్నిరకాల మిస్టరీలు కూడా వీడనున్నాయి. అయితే ఏపీలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల హవే నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. వ్యవస్థలు మేనేజ్ చేసే శక్తి ఉంది కాబట్టి జాతీయ పార్టీ అయిన బీజేపీని పరిగణలోకి తీసుకుంటున్నారు. లేకుంటే కాంగ్రెస్, వామపక్షాల మాదిరిగానే బీజేపీని ట్రీట్ చేసే అవకాశం ఉంది. అయితే ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు వస్తుండడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఏపీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. కానీ ఒంటరిగా ప్రభావం చూపేంత స్థాయిలో ఆ పార్టీలు లేవు. వైసీపీ, టీడీపీ, జనసేనలో ఏదో ఒక పార్టీని జతకడితే తప్ప ఉనికిని చాటుకోలేని దయనీయస్తితో జాతీయ పార్టీలు ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఎన్నికల్లో ఎదురైన పరిణామాలతో చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో కలిసి ట్రావెల్ చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో పవన్ లేకపోతే తనకు ఓటమి మరోసారి ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే అటు బీజేపీ ఇటు జనసేనల కోసం ఆయన తెగ తాపత్రయ పడ్డారు. అయితే పవన్ విషయంలో చంద్రబాబుకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రాష్ట్ర బీజేపీలో ఒక వర్గం టీడీపీని వ్యతిరేకిస్తూ వస్తోంది. మరోవర్గం మాత్రం మూడు పార్టీలు కలిస్తేనే బీజేపీ ఎదుగుదలకు సాధ్యపడుతుందని భావిస్తోంది. కానీ బీజేపీ కేంద్ర పెద్దలు 2019 లో చంద్రబాబు వ్యవహార శైలిని మరిచిపోలేకపోతున్నారని.. అందుకే ఆయనతో కలిసి నడిచేందుకు విముఖత చూపుతున్నారని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. తమ పార్టీ జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటుందని.. టీడీపీ అవసరం లేదని చెబుతోంది. అయితే చివరి వరకూ వేచిచూసే ధోరణిలో చంద్రబాబు ఉన్నారు. ఆయన ఏ అవకాశాన్ని విడిచిపెట్టేందుకు ఇష్టపడడం లేదు. గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో తన వ్యతిరేక రాజకీయ శక్తులు కలిసి ఆడిన గేమ్ ఇప్పటికీ చంద్రబాబు కళ్లెదుట మెదులుతోంది.
అయితే మారిన జాతీయ రాజకీయ పరిస్థితులు దృష్ట్యా బీజేపీ వ్యూహంలో మార్పు వస్తుందని.. అందుకు తగ్గట్టుగానే పావులు కదపవచ్చన్న రీతిలో చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి సరైన మిత్రుడు లేరు. బిహార్ సీఎం నితీష్ కుమార్ దురమయ్యారు. అటు మహారాష్ట్ర ఎపిసోడ్ లో ఏక్ నాథ్ షిండే రూపంలో స్నేహితుడు దొరికినా ఆయన ఏమంత అనుభవ శాలి కాదు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు వస్తే.. మిత్రులను తన దరికి చేర్చే వారు లేరు. అందుకే చంద్రబాబు విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఓకింత అనుకూలంగా ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది., అటు రాష్ట్రపతి, ఉఫరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధానితో వేదిక పంచుకోవడం వంటి పరిణామాలను చంద్రబాబు సానుకూలంగా మార్చుకున్నారు. అదే సమయంలో తన పాత మిత్రుల ద్వారా సంధి కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇవన్నీ బీజేపీతో కలిసి ట్రావెల్ చేసే అవకాశాలు కల్పిస్తాయని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు.

నవంబరు 11 ను విశాఖకు ప్రధాని మోదీ రానున్నారు. రూ.400 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అధికారికి కార్యక్రమం అయినా పార్టీకి కొంత సమయం వెచ్చించే అవకాశం ఉంది. అప్పటికే తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. అందుకే బీజేపీ శ్రేణులతో సమావేశమై పొత్తుల గురించి సంకేతాలిచ్చే అవకాశమైతే ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీని టార్గెట్ చేసుకొని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. అటు తరువాత రాజకీయ సభల్లో ఆయన పాల్గొనలేదు. మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ మద్దతు ప్రకటించింది. అమరావతి రైతులు కూడా ప్రధానిని కలిసే అవకాశం ఉంది. అటు జనసేన టీడీపీకి దగ్గర కావడం, చంద్రబాబు సైతం బీజేపీ వైపు చూస్తుండడంతో ప్రధాని ఏం చెబుతారా? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికైతే ప్రధాని మోదీ విశాఖ పర్యటన తరువాత చాలా అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.