https://oktelugu.com/

Zero FIR: నేరం జరిగితే.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే..

Zero FIR: గత ఏడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్.. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 1, 2024 / 10:35 AM IST

    Zero FIR

    Follow us on

    Zero FIR: మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ.. నిన్నటి వరకు బ్రిటిష్ వలస చట్టాలనే అమలయ్యాయి. పేరుకు భారతీయ శిక్షాస్మృతి అని సంబోధిస్తున్నప్పటికీ.. బ్రిటిష్ పరిపాలకులు రూపొందించిన చట్టాలనే అనుసరించారు, అమలు చేశారు.. అయితే ఇకనుంచి అవి కాలగర్భంలో కలిసిపోయినట్టే.. గత ఏడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్.. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. మారిన చట్టాల ప్రకారం భారతీయ పౌరులకు సత్వరం న్యాయ సేవలు ఆందనున్నాయి.

    జీరో ఎఫ్ఐఆర్

    కొత్త చట్టాల రూపకల్పన సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు, అతి గొప్ప వెసలు బాటు జీరో ఎఫ్ఐఆర్. దీని ప్రకారం నేరాలకు గురైన వారు ఇకపై ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం ఉంది. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని పోలీస్ శాఖ సిబ్బంది తప్పించుకునేందుకు వీలుండదు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాల్సిందే. వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే. ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోకి.. ఆ కేసును బదిలీ చేయాల్సి ఉంటుంది.

    నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు

    బాధితులు పోలీస్ స్టేషన్ నేరుగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే అధికారిక పోలీస్ వెబ్ సైట్ లేదా యాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విధానాలలో ఫిర్యాదులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిపై సంబంధిత పోలీసులు మూడు రోజుల్లోగా ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి సంతకం తీసుకొని ప్రాథమిక విచారణ జరపాలి. ఆ తర్వాత కేసు నమోదు చేయాలి. వాస్తవానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఇప్పటివరకు ఇటువంటి ప్రొవిజన్లు లేవు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు ప్రవేశపెట్టడంతో జీరో ఎఫ్ఐఆర్ విధానం దేశవ్యాప్తంగా అమలు కానుంది.. ఈ – ఎఫ్ఐఆర్ కూడా అమల్లోకి రానుంది..

    నిపుణులను తీసుకెళ్లాల్సిందే

    ఇక ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేందుకు ఆస్కారం ఉన్న కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులు కచ్చితంగా ఘటన స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేరం జరిగిన ప్రాంతం, అక్కడున్న పరిస్థితులు, ఆడియో, వీడియో, ఇతర ఆధారాలను క్షుణ్ణంగా రికార్డు చేయాల్సి ఉంటుంది.. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాబ్ లు అందజేయనున్నాయి. వాటిల్లో పోలీసుల రికార్డ్ చేస్తే అవి నేరుగా ఈ సాక్ష్య అనే డిజి లాకర్ లోకి వెళ్లిపోతాయి.. దాని ప్రకారం పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు వాటిని పరిశీలించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆధారాలను మాయం చేసేందుకు ఏ మాత్రం అవకాశం ఉండదు.

    రెండు నెలల్లో పూర్తి చేయాలి

    కొత్త చట్టాల ప్రకారం మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి దర్యాప్తును రెండు నెలల్లోనే పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాలను కేవలం మహిళా మేజిస్ట్రేట్ ఎదుట మాత్రమే నమోదు చేయాలి. ఒకవేళ ఆమె అందుబాటులో లేకుంటే మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే ఆ క్రతువు పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరచొద్దు.

    అత్యాచార కేసులకు సంబంధించి బాధితురాలు వాంగ్మూలాలను ఆడియో, వీడియో ద్వారా నమోదు చేయాలి. మూడు నుంచి ఏడు సంవత్సరాలకు శిక్ష పడే కేసులలో ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. రెండు వారాల్లో దర్యాప్తు చేపట్టి, కేసు విచారణను దాదాపు 80% పూర్తి చేయాలి. ఇక ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం ఏదైనా కేసులో నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత 14 రోజుల్లోనే పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ గడువును పొడిగించారు. కొత్త చట్టాల ప్రకారం బాధితులు, నిందితులు ఎఫ్ఐఆర్ పత్రాలను ఉచితంగానే స్వీకరించవచ్చు. పోలీసు రిపోర్ట్, చార్జిషీట్, వాంగ్మూలం, ఇతర దస్త్రాలను రెండు వారాల్లోగా ఉచితంగా తీసుకోవచ్చు. ఏదైనా కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినప్పుడు కచ్చితంగా ఆ సమాచారాన్ని అతని బంధువులు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. ఇక అతడి అరెస్టుకు సంబంధించిన వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏదో ఒక రూపంలో ప్రదర్శించాలి. కేసులకు సంబంధించిన దర్యాప్తు, న్యాయ విచారణ సమన్లను వాట్సప్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా కూడా పంపించవచ్చు.