
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. కరోనా పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం 21రోజుల లాక్డౌన్ చేపట్టింది. ఏప్రిల్ 14తో మొదటి విడుద లాక్డౌన్ ముగియగా మరో 19రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో మే 3వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. నిత్యం ఇంట్లో ఉండటంతో ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉచిత డాటా, అపరిమిత కాల్స్, డీటీహెచ్ సేవల సదుపాయాలను కల్పించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై మనోహర్ ప్రతాప్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.
లాక్డౌన్ పీరియాడ్లో ప్రజలు మానసిక ఒత్తిడి గురికాకుండా కేంద్రం, ఆరోగ్య మంత్రిశాఖ తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని మనోహర్ ప్రతాప్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. మే 3వరకు లాక్డౌన్ కొనసాగనున్నందున అప్పటివరకు అన్ని చానళ్లను అపరిమితంగా వీక్షించే సదుపాయం కల్పించేలా చూడాలని ఆయన కోరారు. ఈ దిశగా ప్రభుత్వం, ట్రాయ్ లను ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో కోరాడు. అలాగే వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు కంటెంట్‌ను పూర్తిగా ఉచితంగా అందించేలా సూచించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ప్రజలు ఇళ్ల నుంచి బటయటికి వెళ్లకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు ఉపయోగపడుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఏవిధమైన ఆదేశాలను జారీ చేయనుందో వేచి చూడాల్సిందే..