BJP- Rajya Sabha: బీజేపీ అంతరంగం అంతుపట్టడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుకోసం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఒక్క కర్నాటక తప్ప చిక్కింది లేదు. అటు తెలంగాణ కాస్త ప్రభావం పెరిగినా అధికారానికి దగ్గరగా వెళ్లేంత బలం కనిపించడం లేదు. అందుకే మోదీ, షా ద్వయం దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారన్న వార్త ఎప్పటి నుంచో ఉంది. కేంద్రంలో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి వార్తలు మరీ అధికమయ్యాయి. ఏ రాజకీయ పార్టీ అయినా బలం పెంచుకునేందుకు మొగ్గుచూపుతుంది. దానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విషయంలో బీజేపీపై ఉన్నంత ప్రచారం ఇంకా ఏ పార్టీపై కూడా లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ తన కబంధ హస్తాల్లో తెచ్చుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ మీడియాలో రకరకాల విశ్లేషణలు వస్తుంటాయి. రాజకీయపక్షంగా అది వారి హక్కు. పార్టీని బలోపేతం చేయాలన్న ఆకాంక్ష ప్రతీ నాయకుడిలోనూ ఉంటుంది. లేకుంటే రెండు లోక్ సభ స్థానాలతో ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ ఈ స్టాయికి చేరుకుంటుందా? సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని వెనక్కి తోసి భారతదేశ ప్రజల అభిమానాన్ని చూరగొంటుందా? అయితే ఎవరి అభిప్రాయం వారిది.
జరిగే పనేనా?
తాజాగా బీజేపీ దక్షిణాదిలో పాగ వేయడానికి ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అయితే అది ఉత్తరాధి రాష్ట్రాల అంతా ఈజీ కాదు. దక్షిణ భారత దేశంలో ప్రాంతీయ పార్టీలది సంస్థాగత బలం. ప్రాంతీయ, భాషాభిమానాలు ఎక్కువ. అందుకే బీజేపీ దశాబ్ద కాలంగా చొచ్చుకెళ్లాలని ప్రయత్నించినా పని జరగడం లేదు. సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న పార్టీలవి. జాతీయ పార్టీలతో విసిగివేశారి… రాజకీయంగా వివక్షకు గురైన దక్షిణాది రాష్ట్రాలు ఒక ప్రాంతీయ పార్టీకి బదులు ఇంకో ప్రాంతీయ పార్టీకి ఎన్నుకుంటున్నాయే తప్ప జాతీయ పార్టీల వైపు చూడడం లేదన్నది వాస్తవం. పేరుకే జాతీయ పార్టీలు కానీ.. రాష్ట్రాలకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలకు ఉప పార్టీలుగా మిగులుపోతున్నాయి తప్ప నేరుగా బరిలో దిగే చాన్స్ జాతీయ పార్టీలకు లేకపోవడం గుర్తించాల్సిన విషయం.
Also Read: YCP Plenary: వైసీపీ రాజ్యాంగంలో ‘రాజు’ జగన్..?
రాజకీయంలో భాగం..
అయితే దక్షిణాది రాష్ట్రాలు తమ చేతిలోకి రాకపోవడం మోదీ, షా ద్వయానికి రుచించికపోవడం సాధారణం. అయితే వారు దక్షిణాది రాష్ట్రాల విషయంలో రకరకాల వ్యూహాలు రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేకపోలేదు. ఒకటి నేరుగా బరిలో దిగడం. లేకుంటే ప్రాంతీయ పార్టీల బలం, బలహీనతలపై ఆధారపడడం వ్యూహంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఇదే ఫార్మూలాతో తమిళనాడులో అన్నా డీఎంకేను తన ఆధీనంలో తెచ్చుకున్నారు. ఏపీలో అటు జనసేన, ఇటు వైసీపీతో చెలిమి నడుపుతున్నారు. మరోవైపు టీడీపీ కూడా బీజేపీతో కలిసేందుకు తహతహలాడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకొని చంద్రబాబు దెబ్బతిన్నారు. మూల్యం చెల్లించుకున్నారు. జగన్ బాగా లాభపడ్డారు. కేంద్రంలోని బీజేపీనిదూరం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసిపోటీ చేస్తే కేంద్రం సహకారం ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విషయంలో.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నట్టు టాక్ నడుస్తోంది.
అసంత్రుప్తి చల్లార్చేందుకే..
ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి నలుగురు దిగ్గజాలకు రాజ్యసభకు నామినేట్ చేశారు. కేరళ నుంచి పీటీ ఉష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విజయేంద్రప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్నాటక నుంచి వీరేంద్ర హెగ్గేను రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే ఇక్కడ కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీ దక్షిణాదిలో బలం పెంచుకునేందుకేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం లేదన్నది వాస్తవం. పదవుల పంపకాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న వాదన అయితే ఉంది. ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభకు ఇప్పటివరకూ ఒక్కర్నీ నామినేట్ చేయలేదు. ఒక్క కంభంపాటి హరిబాబుకు మాత్రం గవర్నర్ పోస్టు వచ్చింది తప్పితే.. కొత్తగా ఒక్కరికీ పదవిచ్చిన దాఖలాలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ నాయకుల్లో కూడా ఓకింత అసంత్రుప్తి ఉంది. ఉత్తరాధి రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పదవులు దక్కలేదని బీజేపీ నేతలే అంగీకరిస్తారు. ఈ నేపథ్యంలో కనీసం నామినేట్ కోటాలో అయినా న్యాయం చేస్తామని భావించి నలుగర్నీ ఎంపిక చేశారు. ఇందులో ఏ ఒక్కరికీ రాజకీయ నేపథ్యం లేదు. రాజ్యసభ పదవులిచ్చిందని బీజేపీకి సానుభూతిపరులుగా మిగులుతారు తప్ప.. ఆ పార్టీకి ప్రయోజనం మాత్రం లేదు. అలాగని బీజేపీ కోటాలో వీరు నామినేట్ అవ్వలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా మోదీ దక్షిణాది రాష్ట్రాలపై ఫొకస్ లో భాగంగానే వీరికి పదవులు లభించాయంటే అతి ఉత్తమాటే.
Also Read:Monkeypox: ప్రపంచంపైకి మరో మహమ్మారి.. 59 దేశాలకు హెచ్చరిక