Boora Narsaiya Goud: తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు. తమకు పార్టీలో సరైన విలువ లేదనే ఉద్దేశంతో ఇంకా కొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో నాయకులకు అసలు విలువ లేదని, వారికి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. అందరిని బానిసలుగా చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పార్టీలో చాలా మందిలో లోపల ఆగ్రహం ఉన్నా బయటకు మాత్రం కనిపించకుండా కవర్ చేసుకుంటున్నారు తప్ప అందరిలోను అధినేత తీరుపై కోపం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని వీడేందుకు కొందరు బీజేపీ నేతలతో టచ్ లో ఉంటున్నట్లు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగపాటు ఎదురు కానుంది. నేతల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. పార్టీలో తండ్రి కొడుకులదే ఆధిపత్యం. వారు చెప్పిందే వినాలి. వారు అన్నదే పలకాలి. లేదంటే వేధింపులే. ఈ క్రమంలో పార్టీలో చాలా మంది నేతల్లో లోపల కుమిలిపోతున్నా బయటకు మాత్రం తాము టీఆర్ఎస్ లోనే ఉంటామని గంభీరాలు చెబుతున్నారు. కానీ సమయం వస్తే అందరు పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారం ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఇంకా కొంత మంది కూడా పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తదితరుల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం పురోభివృద్ధి సాధిస్తుందనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో తెలంగాణ కోసం బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. పార్టీ నేతలు ఇలా వరుస కట్టి పార్టీని వీడితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ కు ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తోంది. పైకి మాత్రం తామే గెలుస్తామని బింకాలు పోతోంది. పరిస్థితి చూస్తే బీజేపీకే అనుకూలంగా మారుతుందని చెబుతున్నారు.