Former MLC Puranam Satish: మాట్లాడితే.. తమ పార్టీ నాయకులంతా సుద్దపూలు.. మచ్చలేని చంద్రులు, ఇంద్రులు అని చెబుతాడు తెలంగాణ ముఖ్యమైన మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు. ఇక విపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకులను తంబాకు బ్యాచ్, చిల్లరగాళ్లు, అవినీతి పరులు, అడ్డంగా దొరికిన దొంగలు అని విమర్శిస్తాడు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ మచ్చలేని చంద్రడు.. నిండు సభలో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరువు తీశాడు. సభా వేదికపై కేటీఆర్ మాట్లాడుతుండగా, మరోవైపు సభకు హాజరైన జనం చూస్తుండగానే జేబులో నుంచి అది తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
దీన్నేమంటారు మంత్రివర్యా..
అధికారంలో ఉండి కూడా విపక్ష నేతలు మాట్లాడినట్లుగా అడ్డం పొడుగు మాట్లాడడం కేటీఆర్‌కు ఇటీవల అలవాటైంది. భాష, ధూషణలో తండ్రి కేసీఆర్‌నే మించి పోతున్నాడు. అధికారంలో ఉన్నామని విపక్షాలపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నడుచుకుంటూ ఏదో చతిలో వేసుకుని బుక్కాడు. ఈ వీడియోను అప్పట్లో బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇకేముంది కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా తెలంగాణ ముఖ్యమైన మంత్రి ఎక్కడ మాట్లాడినా బండి సంజయ్ తంబాకు బ్యాచ్, లవంగం బ్యాచ్ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురించి కూడా అంతే స్థాయిలో దూషణలకు దిగుతున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అని పదే పదే ఆరోపిస్తున్నారు కేటీఆర్.
తనను అనకుండా స్టే..
ఇక కేటీఆర్‌ను విపక్షాలు విమర్శిస్తే మాత్రం సదరు అమాత్యుడు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో అప్పట్లో రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలుచేశారు. అధికారంలో ఉన్న మంత్రి దీనికి సమాధానం చెప్పకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తర్వాత డ్రగ్స్ ఆరోపణలను కూడా రేవంత్ తీవ్రతరం చేశారు. రకుల్‌ప్రతీ సింగ్‌తో తిరుగుతున్నారని ఆరోపించారు. దీనిపై కూడా కేటీఆర్ కోర్టుకు వెళ్లి తనపై ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కేటీఆర్ చేసిన ఆరోపణలను విపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి దీటుగా తిప్పి కొడుతుంటే.. కేటీఆర్ మాత్రం తనపై ఆరోపణలు రాగానే కోర్టుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఇటీవల టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కూడా కేటీఆర్ అభాసుపాలయ్యారు. విచారణ జరుగుతుండగానే ఆ కేసులో ఇద్దరే ఉన్నారని ప్రకటన చేశారు. కానీ సిట్ ఇప్పటి వరకు 20 మందికిపై అరెస్ట్ చేసింది. దీని గురించి విపక్షాలు ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదు. లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉన్నట్లు రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో కోర్టుకు వెళ్లలేదు. కోర్టును ఆశ్రయిస్తే తనకే రివర్స్ అవుతుందనే భయంలో ఆగిపోయారని సమాచారం.
కేటీఆర్ సభలో అంబార్ బుక్కిన మాజీ ఎమ్మెల్సీ..
ఇక తమ పార్టీ నేతలంతా మంచోళ్లు అని కేటీఆర్ పదే పదే వెనుకేసుకొస్తారు. కానీ, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇటీవల నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సభా వేదికపైనే అంబార్ బుక్కారు. ఒకవైపు కేటీఆర్ ప్రసంగం కొనసాగుతోంది. మరోవైపు సభకు వచ్చిన వారంతా చూస్తున్నారు. వేదికపై ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. ఇవేమీ పట్టించుకోని మాజీ ఎమ్మెల్సీ జేబులో నుంచి అంబార్ ప్యాకెట్ తీసి చేతులో పోసుకుని దవడకు పెట్టుకున్నారు.
నిషేధిత గుడ్కా వాడుతున్న అధికార పార్టీ నేత..
వాస్తవానికి అంబార్‌పై తెలంగాణలో నిషేధం ఉంది. అయినా వ్యాపారులు దొంగతనంగా మహారాష్ట్ర నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. ఈ నిషేధిత గుట్కానే మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కేటీఆర్ సభలో బహిరంగంగా తినడం స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.