Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నాయకత్వానికి చికాకు పెడుతున్నారు. మాటిమాటికీ అలక పాన్పు ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి అలకబూనారు. ఈసారి అలకకు పోలీసుల నిర్లక్ష్య ధోరణి కారణమట. నకిలీ డాక్యుమెంట్స్ కుంభకోణంలో నిందితులను అరెస్టు చేయాలని ఒంగోలు ఎస్పీని కోరారు. ఇప్పటికే ఈ స్కామ్ లో ఏడుగురు నిందితులను పోలీసుల అరెస్టు చేశారు. అయితే తాను చెప్పినట్టు పోలీసులు వ్యవహరించలేదని, నిందితులను అదుపులోకి తీసుకోలేదని ఏకంగా తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాయి. ఎల్లో మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. దీనికి పోలీసుల తీరే కారణమని బాలినేని అనుమానిస్తూ వచ్చారు. పోలీసులే తెలుగుదేశం పార్టీ నాయకులకు లీకులు ఇస్తున్నారని.. వారి ద్వారానే ఆంధ్రజ్యోతి, ఈనాడులో కథనాలు వస్తున్నాయని బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నారు.
అయితే ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని కలెక్టర్ సమక్షంలో ఎస్పీని బాలినేని కోరారు. తన సూచనలను పట్టించుకోలేదని.. అసలైన నిందితులను విడిచిపెట్టారని ఆయన భావిస్తున్నారు. అందుకే ఏకంగా డిజిపి కి లేఖ రాశారు. అంతటితో ఆగని బాలినేని వైసీపీ ప్రభుత్వానికి ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేశారు. నాలుగేళ్ల నుంచి ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నట్లుగా బాలినేని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ధోరణిని ఎన్నడూ చూడలేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి కోల్పోయిన నాటి నుంచి బాలినేని ఒక రకమైన నైరాశ్యంలో ఉన్నారు. చిన్న విషయానికి సైతం అలకబూనుతున్నారు. తనను మంత్రి వర్గం నుంచి తొలగించి.. ఆదిమూలపు సురేష్ను కొనసాగించడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గించడాన్ని సహించలేకపోతున్నారు. ఇప్పుడు నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంలో తొలుతా టిడిపి నుంచి ఆరోపణలు వచ్చాయి. అయితే దీని వెనుక వైవి సుబ్బారెడ్డి ఉన్నారని బాలినేని అనుమానిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎల్లో మీడియా ట్రాప్ లో బాలినేని పడ్డారు. పార్టీపై ఉన్న అసంతృప్తితో ఏవేవో మాట్లాడుతున్నారు. బాలినేని వ్యవహారంపై వైసీపీ హై కమాండ్ సీరియస్ గా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.