Political Parties Donation: సాధారణంగా రాజకీయ పార్టీలకు విరాళాలు వస్తుంటాయి. వ్యక్తులు, సంస్థలు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందిస్తుంటాయి. ఈ ఎలక్ట్రోరల్ బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంటుంది. ఇలా విరాళాలు అందుకున్న పార్టీలో బిజెపి ముందు వరుసలో ఉంది. వైసీపీ సైతం తొలి 10 పార్టీల జాబితాలో ఉండడం విశేషం. అయితే ఏపీలో స్కిల్ స్కాం కేసు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో అవినీతి సొమ్ము చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు సైతం వాటినే తేల్చుతున్నాయి.
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ఈ కేసునకు సంబంధించి 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరినట్లు దర్యాప్తు సంస్థ సిఐడి తేల్చింది. ఇందులో క్విడ్ ప్రో ఉందని.. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో సదరు స్కిల్ కంపెనీలే నగదు చేర్చాయన్నది సిఐడి వాదన. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సైతం అమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో అవినీతి సొమ్ము చేరినట్లు దర్యాప్తు సంస్థ సిబిఐ చెబుతోంది. ఈ కేసునకు సంబంధించి డిప్యూటీ సీఎం సిసోడియా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో ఎలక్ట్రోరల్ బాండ్ల జారీ, చెల్లుబాటు ఫై విచారణకు అత్యున్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. అక్టోబర్ 31, నవంబర్ 1న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్ర చూడ్ సారధ్యంలో ధర్మాసనం ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం మళ్లీ తెరపైకి రాకముందే ఈ కేసును తేల్చేయాలని ప్రజా ప్రయోజనం పిటిషన్ దాఖలు అయింది. దానిని అనుసరించే అత్యున్నత న్యాయస్థానం తాజా నిర్ణయానికి వచ్చింది.
రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం 2018 జనవరి 2న కేంద్రం ఈ ఎలక్ట్రోరల్ బాండ్ల పథకాన్ని తెచ్చింది. దీని ప్రకారం పార్టీలు నగదుకుపోదులుగా బాండ్ల రూపంలో విరాళాలు స్వీకరిస్తాయి. భారత పౌరులు, సంస్థలు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. కానీ కొన్ని పార్టీలకు ఏకపక్షంగా విరాళాలు అందుతున్నాయి. అవినీతి సొమ్ము సైతం ఈ బాండ్ల రూపంలోనే చేరుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో క్విడ్ ప్రో ద్వారా 100 కోట్ల రూపాయలు చేరినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ కేసులన్నీ ఎలక్ట్రోరల్ బాండ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఎలక్ట్రోరల్ బాండ్లను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు.. దానిపై జరగనున్న విచారణ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో ఎటువంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.మొత్తానికి చంద్రబాబు అవినీతి దెబ్బకు అన్ని పార్టీలకు ఇప్పుడు విరాళాలు బంద్ అయ్యే పరిస్థితి నెలకొంది.