Homeజాతీయ వార్తలుHemant Soren: సీఎం పోస్టు ఉన్నట్టా లేనట్టా..? పది రోజులే గడువు

Hemant Soren: సీఎం పోస్టు ఉన్నట్టా లేనట్టా..? పది రోజులే గడువు

Hemant Soren: చేతిలో పది రోజుల సమయం.. గవర్నర్ ఇచ్చింది కూడా అంతే గడువు.. ఈలోగా బలం నిరూపించుకోవాలి. ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ఇతర పార్టీలు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అధికార పార్టీకి అంతు పట్టడం లేదు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆయనను కస్టడీ లోకి తీసుకుంది. రేపటి నాడు ఏం చేస్తుందో తెలియదు గానీ ప్రస్తుతానికైతే భూ అక్రమణలు, బొగ్గు గనుల కేటాయింపులు, మనీ లాండరింగ్ వంటి అంశాలను మరింత లోతుగా తవ్వే అవకాశం ఉంది. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించినప్పుడు నాకేం తెలియదు, అసలు సంబంధం లేదు ఆయన వ్యాఖ్యానించారు. మొన్నామధ్య విచారణకు వెళ్ళినప్పుడు ఆయన ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అందుబాటులో లేకుండా పోయారు. ఆ తర్వాత ఆయన అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటిదాకా ముఖ్యమంత్రి గా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు అకస్మాత్తుగా తన పార్టీ ఉపాధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రకటించినంత మాత్రాన అయిపోదు కాబట్టి.. బల నిరూపణ చేసుకోవాలి కాబట్టి… ఆ పార్టీ బాధ్యులు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు.. ఇతర పార్టీలు కూడా కన్నేయడంతో ఆ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హైదరాబాద్ కు మారింది.

పై వ్యవహారం జరుగుతోంది పొరుగున ఉన్న కర్ణాటకలోనో, తమిళనాడులో కాదు. బీహార్ నుంచి విడిపోయి రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్ లో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని అపప్రదను మోస్తున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టాయి. ఇందులో భాగంగానే హేమంత్ సోరెన్ ను అదుపులోకి తీసుకున్నాయి.. ఇక మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన హేమంత్ సోరెన్ ది పూర్తి మెజారిటీ ప్రభుత్వం కాదు.. తన జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ కలబోత అది..పైగా తన పార్టీ ఉపాధ్యక్షుడు చంపాయ్ సోరెన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన నేపథ్యంలో.. బలం నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్ బాట పట్టారు. పాట్నా, రాంచి, ఇతర ప్రాంతాల్లో అయితే భద్రత ఉండదని భావించి వారు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చిన ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా ఉండటం.. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో అక్కడి ఎమ్మెల్యేలను ఇక్కడికి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. విమానాశ్రయం నుంచి ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ప్రైవేటు బస్సుల్లో హోటళ్ళ వద్దకు తీసుకువచ్చారు. వేరువేరు హోటళ్ళల్లో వారి బసకు కావలసిన ఏర్పాట్లను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ వంటి పార్టీలు 47 స్థానాలు గెలుచుకున్నాయి. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. బిజెపి 25 సీట్లకు పరిమితమైంది. తాజా మాజీ సీఎం హేమంత్ సోరెన్ దుమ్కా, బర్హైత్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనేక అభియోగాలు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఆయన తన పదవిని కోల్పోయారు.. సంకీర్ణ ప్రభుత్వం నేపథ్యంలో.. కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలను జార్ఖండ్ ముక్తి మోర్చా కాపాడుకుంటుందా? లేక మహారాష్ట్రలో మాదిరిగానే చీలికలు, పేలికలు అవుతుందా? అనేది వేచి చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version