Rosaiah Death: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కురువృద్ధుడైన నేతగా కొణిజేటి రోశయ్యకు పేరుంది. ఆయన హఠాన్మరణంతో తెలుగు రాజకీయాల్లో తీరని ఆవేదన మిగిలింది. తెలుగు రాజకీయాలతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఆయనిది. తొలి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉంటూ..చివరి నిమిషం వరకూ ఆ సిద్ధాంతాలతోనే రోశయ్య కొనసాగారు. రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో రోశయ్యకు గుర్తింపు ఉంది. ఎమ్మెల్సీగా.. ఎమ్మెల్యేగా.. ఎంపీగా.. సీఎంగా.. గవర్నర్ గా రోశయ్య చేపట్టని పదవి అంటూ లేదు. అనేకశాఖలను నిర్వహించి సీఎంలకు కుడిభుజంగా.. ప్రధానంగా ఆర్థిక మంత్రిగా రాష్ట్రబడ్జెట్ ను రూపొందించిన మేధావిగా పేరుంది.
ఇక రాజకీయాల్లో రోశయ్యకు వైఎస్ఆర్, చంద్రబాబుతో ఉన్న అనుబంధం ప్రత్యేకం అని చెప్పొచ్చు. చంద్రబాబు తొలుత కాంగ్రెస్ లో ఉన్న సమయంలో అంజయ్య ప్రభుత్వంలో రోశయ్య కూడా కేబినెట్ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు కూడా నాడు యువ మంత్రి. వీరిద్దరూ కలిసి పనిచేశారు. రోశయ్య సీఎం అయ్యే వరకూ కూడా చంద్రబాబుతో సహా చట్టసభల్లో రోశయ్య సభ్యుడిగా ఉన్నారు. మండలిలోనూ విపక్ష నేతగా రోశయ్య కీలక భూమిక పోషించారు.
ఎన్టీఆర్ హయాంలో నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రోశయ్య వాగ్ధాటిని తట్టుకోలేకనే నాటి సీఎం ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారంటే మన రోశయ్య భాషపటిమను అర్థం చేసుకోవచ్చు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలోనూ ప్రతిపక్ష నేతగా రోశయ్య సంధించే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎవరు సీఎం అయినా కూడా రోశయ్య ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా ఆయనకు కేబినెట్ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసేవారు. సీఎంలకు, కాంగ్రెస్ కు అత్యంత విధేయుడిగా కీలక శాఖలు రోశయ్య నిర్వహించేవారు. 14 శాఖలు నిర్వహించిన ఘనత మన రోశయ్య సొంతం. అందులో ఆర్థిక-శాసనసభా వ్యవహారాలను ఎక్కువగా చేశారు. వైఎస్ఆర్ కేబినెట్ లో కీలకమైన ఆర్థిక-శాసనసభా వ్యవహారాలను రోశయ్యనే చేపట్టడం విశేషం. వైఎస్ఆర్ పథకాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారమవుతోందని స్వయంగా అసెంబ్లీలోనే చెప్పిన గొప్ప దైర్యం రోశయ్య సొంతం. ఇక వైఎస్ఆర్ మరణించాక సీఎం అయ్యారు రోశయ్య. సీఎంగా బాధ్యతలు చేపట్టి 14 నెలలు ఆ పదవిలో కొనసాగారు.
ఇక మెగాస్టార్ చిరంజీవితో రోశయ్యకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రజారాజ్యం ఏర్పాటుకు ముందే చిరంజీవిని రాజకీయాల్లోకి రోశయ్య ఆహ్వానించారు.
Also Read: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. ఆయన ప్రస్థానం..!
రోశయ్య మరణవార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చిరంజీవి తన అనుబంధాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. సీఎంలు కేసీఆర్, జగన్, చంద్రబాబులు సైతం సంతాపం తెలిపారు.
విద్యార్థి సంఘం నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి చేరిన రోశయ్య ప్రస్థానం కాంగ్రెస్ లోనే సాగింది. ఆయన కాంగ్రెస్ వాదిగానే మరణించారు. పార్టీ మారకుండా నిబద్ధతతో.. విధేయతతో పనిచేసిన రోశయ్య సేవలు మరువలేనివి. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఓ గొప్ప నేతగా రోశయ్యను చెప్పొచ్చు. రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలో ఓ శకం ముగిసిందన్నారు.
Also Read: ఆ సర్వేలో ఏపీ నెంబర్ వన్.. జగన్ కే క్రెడిట్..!