JMM Party Jharkhand : జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ నాయకుడు చంపై సోరెన్ పార్టీ మారుతున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఆయన కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం బీజేపీ కీలక నాయకులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తున్నది. ఆయన వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన ఇందుకు సంబంధించి ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. అయితే జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం పడిపోతుందా..? ఎంతమంది ఎమ్మెల్యేలు చంపై వెంట బీజేపీలోకి వెళ్తున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. అయితే బీజేపీ ప్రయత్నాలను మాత్రం సీఎం హేమంత్ సోరెన్ ఖండించారు. బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు. ఢిల్లీలో పరిణామాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలందరూ తనతో టచ్ లో ఉండాలని ఆదేశించారు. పార్టీ కీలక నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. చంపై వెంట వెళ్లిన ఎమ్మెల్యేల వివరాలపై ఆరా తీస్తున్నారు. అయితే చంపై బయటకు వెళ్తే ప్రభుత్వం మారుతుందా..? అసలు జేఎంఎం ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు అనే వివరాలు తెలుసుకుందాం.
బలాబలాలు చూసుకుంటే..
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 82 మంది సభ్యులుఉన్నారు. వారిలో 81 మంది ప్రత్యక్షంగా , మరొకరు నామినేటెడ్ గా ఎన్నికవుతారు. ఇందులో జేఎంఎం కు 27 మది, కాంగ్రెస్ కు 17, ఆర్జేడీకి 1, కమ్యూనిస్ట్ పార్టీ కి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక బీజేపీకి 24. ముగ్గురు ఏజేఎస్ యూ, ఎన్సీపీకి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. ఇక 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి..
దీంతో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 77కి పడిపోయింది. ఇందులో మెజార్టీకి 39 మంది మద్దతుల అవసరం. ప్రస్తుత ప్రభుత్వానికి 45 మంది సభ్యుల సపోర్ట్ ఉంది. ఇందులో చంపై వెంట ఆరుగురు వెళ్తే ఈ సంఖ్య 38కి పడిపోతుంది. దీంతో జేఎంఎం ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది.
జేఎంఎం ప్రభుత్వం పడిపోతుందా..?
ఇక చంపై వెంట ఏడుగురు బయటకు వెళ్తే.. వారి సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని కాపాడుకునే అవకాశం హేమంత్ సోరెన్ కు ఉంది. వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తే అసెంబ్లీ పూర్తి బలం 70 కి పడిపోతుంది. దీంతో మెజార్టీ సంఖ్య 36కి పడిపోతుంది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని కాపాడుకునే వీలు హేమంత్ సోరెన్ కు ఉంది. మరోవైపు బీజేపీ అవిశ్వాస తీర్మానం పెడితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై చర్చ నడుస్తున్నది.
అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టారు. నాడు సీఎం గా ఉన్న చంపై సోరెన్ అందులో నెగ్గారు. మరి ఆరు నెలల్లోనే మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టడంపై కొంత అనుమానాలు ఉన్నాయి. కాగా, చంపై వెంట ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అనే దానిపైనే ఇప్పుడు హేమంత్ సోరెన్ భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే ఆయన ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారు.
అసలేం జరిగిందంటే..
ఇక చంపైని బీజేపీలోకి ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రి జీతన్ రాయ్ మాంఝీ ఒక పోస్ట్ ఫెట్టారు. చంపై నువ్ పులివి.. నీకు మా కూటమిలోకి ఆహ్వానం అంటూ స్వాగతం పలికారు. అయితే ఇప్పుడు చంపై పెట్టిన పోస్టుపైనే అందరి దృష్టి నెలకొంది. ‘ముఖ్యమంత్రి గా ఉండగా నా కార్యక్రమాలను రద్దు చేశారు. నన్ను రాజీనామా చేయమన్నారు. నా ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించారు. జీవితాన్ని ధారబోసిన పార్టీలో నా ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని భావిస్తున్నా. నా ఈ ప్రయాణంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయని అనుకుంటున్నా.. నాది వ్యక్తిగత పోరాటం.. ఇందులోకి జేఎంఎం నాయకులను లాగొద్దు అంటూ చెప్పుకొచ్చారు. చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి అన్యాయం చేయాలని కలలో కూడా అనుకోలేదు. అలాంటి పరిస్థితులను కల్పించారు.. అంటూ రాసుకొచ్చారు.’ ఈ నేపథ్యంలోనే చంపై ఇక పార్టీ మారడం ఖాయమని తెలుస్తున్నది.