
Neeraja Reddy : విధి రాతను ఎవరూ తప్పించలేరు అంటారు. భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ రాత ప్రకారం జరగాల్సిందే. విధి ఆడే వింత నాటకంలో మనమంతా పాత్రదారులం మాత్రమే. జననం.. మరణం అంతా విధి ప్రకారమే జరుగుతుంది. ఊహకు అందని రీతిలో సంభవించే కొన్ని ఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇటువంటి ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతుంటారు. తాజాగా కర్నూలు జిల్లా అలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , బిజెపి నాయకురాలు పాటిల్ నీరజారెడ్డి ప్రమాదవశాత్తు మృతి అదే కోవలోకి వస్తుంది అంటున్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భాజపా నాయకురాలు నీరజారెడ్డి (50) ఆదివారం మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళుతుండగా బీచ్ పల్లి వద్ద కార్ టైర్ పెళ్లి బోల్తా కొట్టడంతో తీవ్ర గాయాలు పాలైన ఆమెను.. వెంటనే కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నీరజారెడ్డి భర్త శేసిరెడ్డి గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురయ్యారు. నీరజా రెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు.
ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా..
నీరజా రెడ్డి 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆలూరు నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. అంతకు ముందు 2004 లో పత్తికొండ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా దేవరకొండ మండలం ఆలూరు నియోజకవర్గంలో చేరడంతో 2009లో ఆలూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపై ఐదువేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలోకి ఆమె అడుగు పెట్టారు. తరువాత ఏర్పడిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో వైసీపీలో ఆమె చేరారు. అక్కడ రాజకీయ ఇబ్బందులతో ఇమడ లేకపోయిన ఆమె బిజెపిలో చేరారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న ఆమె.. దురదృష్టవశాత్తు ప్రమాదంలో మృతి చెందారు.
విధి రాత అంటే అదే..
రోజు కారులోనే ప్రయాణం సాగించే నీరజారెడ్డి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచి వేసింది. కారు టైరు పేలి బోల్తా కొట్టడంతో ఆమె మృతి చెందారు. అంటే విధిరాత అలా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు చెబుతున్నారు. లేకపోతే కారు టైరు పేలి ఇంత పెద్ద దుర్ఘటన జరగడం ఏమిటని అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక మంచి నేతను కోల్పోవాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.