Narendra Mody Sorry: మడమ తిప్పడు.. ఆడిన మాట తప్పడు అన్న పేరున్న దేశపు పెద్ద మనిషి ప్రధాని మోడీ తొలిసారి తను తీసుకున్న ఒక గొప్ప సంస్కరణ పై వెనక్కి తగ్గాడు. ఏడాదిగా దేశ రాజధాని సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల పోరాటానికి తలవంచాడు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
Also Read: సాగు చట్టాల రద్దు: మోడీ పంతం ఓడింది.. రైతే గెలిచాడు!
మోడీ తీసుకున్న నిర్ణయం నిజంగానే దేశ రైతాంగం సాధించిన అద్భుత విజయంగా చెప్పొచ్చు. ఏడాది కాలంగా వారు చేస్తున్న పోరాటానికి గొప్ప ప్రతిఫలం దక్కిందని అనొచ్చు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేశారు.
మోడీ నైజం చాలా కఠినంగా ఉంటుంది. ఎప్పుడూ వెనక్కి తగ్గడు. ఆ నిర్ణయం ఏదైనా సరే బలంగా ముందుకు వెళతాడు. ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయాల్లోనూ మోడీ వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. కానీ అన్నదాతల ఆగ్రహానికి మోడీ తొలిసారి తలొగ్గాడు.
నిజానికి మోడీ తీసుకున్న వ్యవసాయ చట్టాల నిర్ణయం కార్పొరేట్లకు దోచిపెట్టేలా.. సామాన్య రైతుల ఉసురు తీసేలా ఉన్నాయని రైతుల నుంచి మేధావుల వరకూ అందరూ వ్యతిరేకించారు. ఏడాదిగా ఉత్తరాధి రైతులు ఆందోళన చేస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకూమారి వరకూ నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కిసాన్ ఉద్యమాలు సాగాయి.
ముఖ్యంగా ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది పంజాబ్, హర్యానా రైతులే.. చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు.రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రైతుల ఉసురు మోడీ సర్కార్ కు గట్టిగానే తగులుతుంది. పైగా యూపీలోని లఖీంపూర్ లో బీజేపీ నేతలు ఏకంగా రైతులపైకి ఎక్కించి చంపారు.
అందుకే ఇక రైతులతో పెట్టుకుంటే తమ సర్కార్ మనుగడకే ముప్పు అని గ్రహించిన మోడీ రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించి తమ నిర్ణయాల వల్ల బాధపడి ఉంటే క్షమించాలి అంటూ కోరారు. ఇప్పటికైనా రైతుల ఆందోళన విరమించాలన్నారు.
దేశ ప్రధాని.. అత్యున్నత సర్వాధికారి.. ఇప్పటివరకూ ఎవరికి తలవంచని.. వెనక్కి తగ్గని మోడీ తొలిసారి ప్రజాబలం.. రైతుల పోరాటానికి తలవంచడం నిజంగానే ఒక గొప్ప చారిత్రక ఘటనగా చెప్పొచ్చు. మోడీ ఏకంగా రైతులకు క్షమాపణ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.