Flood in Rayalaseema: 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ తల్లడిల్లిపోయింది. భారీ వరదల కారణంగా ఇళ్లు, పంటలు కొట్టుకుపోయాయి. కొందరు తమ కుటుంబ సభ్యులు వరదల్లో కొట్టుకుపోవడం చూసి తట్టుకోలేకపోయారు. ఈనెల 16న బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. ఆ తరువాత రాయసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరులో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో 20 సెంటిమీటర్ల వర్షం నమోదు కావడం విశేషం. గత 60 ఏళ్లలో ఇంతటి విపత్తును ఎపుడూ చూడలేదని కొందరు అంటున్నారు. మరోవైపు ఇళ్లు, పంటలు కొట్టుకుపోవడంతో చాలా మంది కట్టుబట్టలతో నిలిచారు. అయితే సహాయక చర్యల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ అంటే వర్షాభావం ప్రాంతం.కానీ ఇంతలా వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అందుకు డ్యామ్ ల నిర్వహణే కారణమని కొందరు అంటున్నారు. ఈ వర్షాల కారణంగా సీమలో ఉన్న మొదట పింఛా డ్యామ్, ఆ తరువాత అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్ కట్టలు పూర్తిగా తెగిపోయాయి. పింఛా డ్యామ్ ఇన్ ఫ్లో 3,845 క్యూసెక్కులు, కానీ 18వ తేదీ సాయంత్రం ఇందులోకి ఒకేసారి 90,464 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఈ డ్యామ్ ఎగువ ప్రాంతంలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్కసారిగా భారీ వరద రావడంతో డ్యామ్ ఆనకట్ట తట్టుకోలేకపోయింది.
పింఛా డ్యామ్ తెగిపోవడంతో అక్కడి నీరంతా అన్నమయ్య ప్రాజెక్టు లోకి చేరింది. దీంతో నవంబర్ 19న అన్నమయ్య ప్రాజెక్టులోకి 3.2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే. కానీ పరిమితికి మించి రావడంతో ఈ డ్యామ్ కూడా తట్టుకోలేకపోయింది. దీంతో గంటల వ్యవధిలోనే రెండు డ్యామ్ కట్టలు తెగిపోయాయి. అంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు డ్యామ్ కట్టలు తెగిపోవడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు.
Also Read: అమెరికా వదిలి.. వ్యవసాయంలో రాణిస్తున్న గుంటూరు యువకుడు..
ఈ ప్రాజెక్టుల నీరు తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు నగరాలకు వెళ్లింది. అత్యధికంగా చెయ్యేరు నదీ తీరంలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. కడప జిల్లాలో ఉన్న ఈ చెయ్యేరులో ఉన్న నది కట్ట తెగిపోయింది. అయితే అంతకుముందు అధికారులు అప్రమత్తత చేయకపోవడంతో ప్రాణనష్టం చేయి దాటిపోయిందని అంటున్నారు. 19వ తేదీ ఉదయం ఇక్కడి ప్రజలు తమ పనులు చేసుకుంటుండగానే వరదనీరు ఒక్కసారిగా వచ్చి మనుషులను తీసుకెళ్లిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ గ్రామంలో 12 మంది వరదలో కొట్టుకుపోయారు. మొత్తంగా వరదల కారణంగా 34 మంది మరణించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
అయితే వరద బాధితులకు అందుతున్న సహాయ సహకరాలపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో 19,832 మందికి మినహా అందరికీ నిత్యావసరాలు అందాయని అధికారులు అంటున్నారు. వరద బాధితులకు రూ.2 వేల చొప్పున సాయం అందిస్తున్నామంటున్నారు. అయితే కడప జిల్లాలో 8 గ్రామాలకు ఇప్పటికీ విద్యత్ సౌకర్యం లేదని, 3,4 రోజులు పరిస్థితి అంతా చక్కబడుతుందని అంటున్నారు.
Also Read: ట్విట్టర్ నుంచి ఎగ్జిట్: హనుమ విహారి-ఎన్టీఆర్ ట్రస్ట్ మధ్య గొడవేంటి?