Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ ప్రభంజనం పెరుగుతోంది. దీంతో బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భైంసా నుంచి కరీంనగర్ వరకు ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను ఎండగడుతున్నారు. అధికారం కోసం రెండు పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు సమ ఉజ్జీలుగా నిలవనున్నాయి. ఈ మేరకు కేసీఆర్ సైతం జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను నిలపాలని ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేశారు. బుధవారం ఢిల్లీలో కార్యాలయ ప్రారంభానికి పలు పార్టీల నేతలను ఆహ్వానించారు.

ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయ వైషమ్యాలు పెరిగాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి బీఆర్ఎస్ కు సవాలు విసిరింది. దీంతో రెండు పార్టీల్లో దూరం పెరిగింది. ఇప్పుడు ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా బీఆర్ఎస్ ను దూషిస్తూ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఈనెల 15న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ముగింపు సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ బండి సంజయ్ కు ఊహించని ఎదురు దెబ్బ ఎదురైంది.
కరీంనగర్ లో నిర్వహించే ముగింపు సభ నిర్వహించనున్న నేపథ్యంలో సంజయ్ కు వ్యతిరేకంగా వెదిరలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో సంజయ్ కు పలు ప్రశ్నలు సంధించారు. ఇంతవరకు ఎంపీగా గెలిచిన తమరు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు? ఎన్ని అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని ప్రశ్నలు వేయడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సొంత నియోజకవర్గంలో సంజయ్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.

మరికొద్ది సేపట్లో బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా వెదిరకు చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆయనకు దర్శనమివ్వనున్నాయి. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో సంజయ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలో ఎన్ని పనులు చేశారో వివరించాలని డిమాండ్ చేయనున్నట్లు రాజకీయ వర్గాల వారి అంచనా. దీతో బండి సంజయ్ ఏ మేరకు స్పందిస్తారు? ఏం చెబుతారు? అనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది.
బండి సంజయ్ ఇలాకాలో ఇలా బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై అందరు తర్జన భర్జన పడుతున్నారు. కావాలనే దురుద్దేశంతో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వాదనలు వస్తున్నాయి. బండి సంజయ్ తన లోక్ సభ నియోజకవర్గంలో ఏ మేరకు పనులు చేశారనే దానిపై సమాధానం చెబుతారా? లేక తన పాదయాత్ర తాను కొనసాగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.