Ayodhya Ram Temple: భారత దేశం శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఘడియ చేరువయింది. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిపై గగనమంత ఎత్తుగా ఎదిగిన రామాలయం ఇప్పుడు పూర్తి రూపం దాల్చింది. శిల, శ్రద్ధ, శక్తి కలయికతో రూపుదిద్దుకున్న ఈ మందిరం కేవలం రాతి నిర్మాణం కాదు, భారత ఆత్మను ప్రతిబింబించే సంస్కృతిశిఖరం.
నిర్మాణాలన్నీ పూర్తి..
అయోధ్యలో రామాలయ నిర్మాణం 2023 జనవరిలో జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ ఆలయంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట చేశారు. ఇక రామాలయానికి అనుబంధంగా మాతా అన్నపూర్ణ, మహాదేవుడు, వినాయకుడు తదితర ఏడు ఆలయాలోతోపాటు వేద మహర్షులైన అగస్త్యుడు, వశిష్టుడు, విశ్వామిత్రుడు, తులసీదాస్, వాల్మీకి, అహల్యాబాయి, శేషావతారాల కోసం సప్త మండపాలు నిర్మించారు. ఇవి రామభక్తి పరంపర వైభవాన్ని మరింత విశాల పరిధికి తీసుకెళ్లింది. ఏడు మండపాలతో కూడిన ఈ సమగ్ర నిర్మాణం కేవలం భక్తి ప్రాంగణం కాదు, ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి కేంద్రబిందువు.
కొత్త యుగ ప్రారంభ సూచిక
ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 25న రామ మందిర ధర్మ ధ్వజం ఎగురవేయనున్నారు. ఈ సందర్భం చారిత్రకమైంది. ఇది శతాబ్దాల పోరాటానికి సాంస్కృతిక పూర్ణ విరామ సూచికగా నిలుస్తుంది. రామ మందిర నిర్మాణం ‘‘రాజకీయ విజయం’’ కన్నా ‘‘జాతి చైతన్యం’’గా భావించాలనే భావజాలం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఈ ధర్మ ధ్వజం ఆవిష్కరణ కేవలం సమర్పణాత్మక చిహ్నం కాదు.. అది భారత సర్వధర్మ సమభావ తత్వానికి ప్రతిరూపం. వివిధ ఆచారాలు, భిన్న రాష్ట్రాల శిల్పకళలు ఈ నిర్మాణంలో కలిసిపోవడం దేశ ఐక్యతను ప్రతిబింబిస్తున్నాయి.
సంస్కృతి పునరుజ్జీవనానికి చిహ్నం..
అయోధ్యను కేవలం ఆలయ కేంద్రంగా కాక, భారతీయ పౌరాణిక భావజాలానికి పునరుజ్జీవన స్థలంగా మలచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆలయ సముదాయంలో ప్రతిష్ఠించిన ఋషుల, దేవతల ప్రతిమలు శాశ్వత బోధనల లక్షణంగా నిలుస్తాయి. ఇది భక్తికి మించి భారతీయ మానసికతను మళ్లీ కేంద్రీకరించే చైతన్య యజ్ఞం. వాల్మీకి, తులసీదాస్, అహల్యాబాయి వంటి ప్రతీకాత్మక స్ఫూర్తులను సమాజం ముందుంచడం – ఆధ్యాత్మికతను సమానత్వం, కర్మనిబద్ధత, త్యాగం వంటి విలువలతో మిళితం చేసే ప్రయత్నం.
అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తవడమే కాదు, అది భక్తిరూప భారతదేశం కొత్త పుట తిప్పడం. ఇది రాజకీయాల కంటే పెద్దది, ఇది విశ్వాసానికి శిల్పరూపం. ధర్మ ధ్వజం ఎగురవేయబడే ఆ ఘడియ భారతీయత్వానికి స్ఫూర్తి ఘడియగా నిలుస్తుంది. భవిష్యత్తులో అయోధ్య కేవలం యాత్రాకేంద్రం కాదు – ఇది కాలాతీత విశ్వాసానికి ప్రతీక, సంస్కృతీ సమన్వయానికి మార్గదర్శి.