https://oktelugu.com/

30 ఏండ్ల కనిష్ఠానికి ఆర్థిక వృద్ధిరేటు

ఇప్పటికే గత ఆరు త్రైమాసికాల నుంచి మందగమన దశలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు లాక్‌డౌన్‌ దెబ్బ శరాఘాతంగా మారనుంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన (1991) తర్వాత అతితక్కువ వృద్ధిరేటు ఈ ఏడాదే నమోదు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 30 ఏండ్ల కనిష్ఠానికి పతనమవుతుందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌’ అభిప్రాయపడింది. ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.1 శాతంగా నమోదవుతుందని ‘ఫిచ్‌’ గతంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 4, 2020 / 10:41 AM IST
    Follow us on


    ఇప్పటికే గత ఆరు త్రైమాసికాల నుంచి మందగమన దశలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు లాక్‌డౌన్‌ దెబ్బ శరాఘాతంగా మారనుంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన (1991) తర్వాత అతితక్కువ వృద్ధిరేటు ఈ ఏడాదే నమోదు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 30 ఏండ్ల కనిష్ఠానికి పతనమవుతుందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌’ అభిప్రాయపడింది.

    ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.1 శాతంగా నమోదవుతుందని ‘ఫిచ్‌’ గతంలో అంచనా వేసింది. కానీ ఓవైపు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం కొనసాగుతుండటం, మరోవైపు కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో తమ అంచనాను కుదిస్తున్నామని, ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 2 శాతంలోపే ఉండవచ్చని ‘ఫిచ్‌’ తాజాగా వెల్లడించింది.

    ‘కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇటీవల చైనాలో పలు పరిశ్రమలు మూతపడటంతో భారత్‌తోపాటు వివిధ దేశాల్లోని మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలకు ముడిసరుకులు, విడిభాగాల సరఫరాలు ఆగిపోయాయి. ప్రస్తుతం చైనాలోని వివిధ పరిశ్రమల్లో మళ్లీ పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవడంతో ఆ ప్రభావం భారత్‌ ఎగుమతులను, కొనుగోలు శక్తిని దెబ్బతీసింది.

    ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు 4 శాతానికి క్షీణిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అభిప్రాయపడింది. ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఏడీబీ ఈ అంచనా వేసింది. అయితే స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉండటంతో 2021-22లో భారత వృద్ధిరేటు పుంజుకొంటుందని ఏడీబీ తన ‘ఆసియా డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌’లో పేర్కొన్నది.

    గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత జీడీపీ వృద్ధిరేటు 5 శాతంగా నమోదవుతుందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్వో) అంచనా వేసింది. ‘ప్రస్తుతం మనం అసాధారణ సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కానీ భారత స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు బలంగా పుంజుకొంటుందని మేము భావిస్తున్నాం’ అని ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త యసుయుకీ సవాడ తెలిపారు.

    కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు భారత్‌ సమర్థంగా పోరాడుతున్నప్పటికీ దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగి దాదాపు 9 శాతానికి చేరింది. గత 43 నెలల్లో ఇదే అత్యధికమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. దేశ నిరుద్యోగరేటు గత నెలలో 8.74 శాతానికి చేరిందని, డీమానిటైజేషన్‌ (పెద్దనోట్ల చెలామణి రద్దు) తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది.