చెరువంటే కల్పతరువు.. ఎంతో మందికి బతుకు దెరువు.. చెరువు నిండితే భరోసా.. అలాంటి చెరువులు ఇప్పుడు నిండుకుండలా మారి ఉగ్రరూపం దాల్చాయి… హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఎప్పుడూ ఏ చెరువు కట్ట తెగుతుందోనని భయం భయంగా జనాలు బతుకుతున్నారు. కబ్జాల పేరిట చెరువులను చెర పట్టి.. వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేసిన జనావళిపై పగ తీర్చుకుంటున్నాయా అనే రీతిలో చెరువులు కన్నెర్ర చేస్తున్నాయి. మరో పది రోజులు వర్షాలు లేకపోతే సరి… ఇంతలో భారీ వర్షం వస్తే మాత్రం అనేక చెరువుల కట్టలు తెగిపోయి.. కాలనీలు నీటమునిగిపోయే అవకాశాలున్నాయి. దీంతో చెరువుల కింది ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దాదాపు 800కాలనీలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. సుమారు 5లక్షల మందిపై ప్రభావం పడనుంది.
Also Read: ‘ధరణి’ ఆన్ లైన్ నమోదుపై కేసీఆర్ కీలక ప్రకటన
*నిండు కుండలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 185 చెరువులున్నాయి. శివారు మున్సిపాలిటీల్లో 111 చెరువులు ఉన్నాయి. వీటిలో 42 శివారు చెరువులు గండ్లు పడి ఇప్పటికే కాలనీలను ముంచాయి. గురువారం నాటికి 80 చెరువులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ప్రధానమైన చెరువులు ఏవంటే.. మీర్ పేట్ పెద్ద చెరువు, బండ్లగూడ, నాగోల్, ఫాక్స్ సాగర్, పీర్జాదిగూడ గూడెం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, రామాంతపూర్ పెద్ద చెరువు, మీరాలం, గగన్ పహాడ్ అప్పా చెరువు, మైలార్ దేవ్ పల్లి పల్లె చెరువు. ఇవన్నీ కూడా నిండు కుండలా మారి అలుగు పోస్తున్నాయి.
* వరద నీరు ఇంకా వస్తోంది..
వర్షం తెరిపినిచ్చినా 80 చెరువులు డేంజర్ జోన్ లోనే ఉన్నాయి.. ఎల్బీ నగర్, ఉప్పల్ , పాతబస్తీ, రాజేంద్ర నగర్, మీర్ పేట, బడంగ్ పేట, హయత్ నగర్, బోడుప్పల్ ప్రాంతాల్లో చెరువుల ప్రమాదం పొంచి ఉంది. చెరువుల్లో నుంచి అలుగు వరద పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కాలనీల్లో రెండు, మూడు అడుగుల ఎత్తు వరకు ప్రవహిస్తోంది. అలాగే పలు కుంటలు, చెరువులకు గండ్లు పూడ్చినా.. గంట గంటకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో వరద వెళ్లే మార్గం లేక కాలనీలపై ప్రభావం పడుతోంది. నాలుగు రోజులుగా వానలు లేకపోవడంతో ఎంతో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంది.
* తప్పెవరిది..
తమ ఉనికి నాశనం చేస్తే పుట్టగతులు ఉండవని చెరువులు హెచ్చరిస్తున్నాయి. చెరువులు, కుంటలని చూడకుండా.. వాటిని తొక్కిపెట్టి వెలిసిన విల్లాలు, పెద్ద భవంతులు, సామాన్య జనాలు..ఇలా ఒకరేమిటి అందరూ కలిసి చెరువు అస్తిత్వాన్ని దెబ్బతీసిన వారే. ఇదే ఇప్పుడు శాపంగా మారుతోంది. చెరువులను కాపాడేందుకు ఏ ప్రభుత్వం, పాలకులు, ప్రజలు.. ఏ ఒక్కరూ ప్రయత్నం చేయలేదు. వాల్టా చట్టం(వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్-–2002) ను పట్టించుకున్నవారులేరు. ఎఫ్ టీఎల్ లో కట్టడాలు, కాల్వలు, తూములు, పంట కాల్వల ఆక్రమణలు ఇలా అన్నీ ఆక్రమించేశారు. వీటన్నంటినీ నిలువరిస్తేనే చెరువు బతుకుతోంది. జనాలను బతకనిస్తుంది.
Also Read: కవితకు ఇప్పుడే నో ఛాన్స్?
* ప్రభుత్వం ఏం చేస్తోంది..
చెరువులు పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ ఆఫీసర్లు చెరువుల కట్టల పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నారు. తూములు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. కట్టలపై నుంచి వరద ప్రవాహించకుండా ఇసుక బస్తాలతో నింపుతున్నారు. పలు చెరువుల కట్టల వద్ద ప్రజలు, పోలీసులు కాపలా ఉంటున్నారు.