AP Private Schools Fees: ఏపీలో ఫీజుల నియంత్రణ ఉత్తర్వులను విద్యాసంస్థల యాజమాన్యాలు బేఖాతర్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకుంటున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చుతూ తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ పరుమార్లు హెచ్చరించినా లెక్కచేయడం లేదు. పక్షం రోజుల్లో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలు మళ్లీ ఫీజుల పెంపుపై దృష్టిపెట్టాయి. విద్యాబోధన, సౌకర్యాల కల్పన కంటే.. ఫీజుల పెంపుపైనే యాజమాన్యాలు ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి చూపుతున్నాయి.
రంగంలోకి నియంత్రణ కమిషన్..
ఫీజుల పెంపు, నియంత్రణకు సబంధించిన ప్రత్యేక ఉత్తర్వులు ఉన్నా.. విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై . ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దోపిడీకి కొత్తపేర్లు పెడుతూ అధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఫీజులు చెల్లించని విద్యార్థులను, తల్లిదడ్రులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు స్పందించారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్, ప్రభుత్వం ఇది వరకే స్పష్టమైనా ఆదేశాలు ఇచ్చాయి. అయినా ఇంకా ఫిర్యాదులు రావడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ ట్యూషన్ ఫీజు కోసం వేధింపులు..
కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లు విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌లో తరగతులు బోధించాయి. ఆ సమయంలో కూడా విద్యార్థుల నుంచి పూర్తి ఫీజు వసూలు చేశాయి.. కొన్ని యాజమాన్యాలు ఇప్పటికీ తల్లిదండ్రులను కరోనా కాలం నాటి పెండింగ్ ఫీజుల పేరిట వేధిస్తున్నాయి. ఈమేరకు కమిషన్‌కు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ విషయాన్ని కాంతారావు ధ్రువీకరించారు. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలని తెలిపారు. అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని జస్టిస్ కాంతారావు స్పష్టం చేశారు. దీనికి అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు. కరోనా కాలంలో తొలగించిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. కమిషన్ ఉత్తర్వులు లెక్క చేయని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమావేశాల నిర్వహణకు ఆదేశం..
డీఈవోలు, ఆర్జేడీలు, ఆర్‌ఐవోలు తమ పరిధిలో తల్లిదండ్రులతో, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విద్యాసంస్థలను గుర్తించాలని కాంతారావు ఆదేశించారు. తమ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆదేశాలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
నేరుగా ఫిర్యాదు చేసేలా..
విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌కు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జస్టిస్ కాంతారావు వెల్లడించారు. 9150381111 నంబర్‌కు ఫోన్ ద్వారా (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది), apsermc2020@gmail.com కు ఈ – మెయిల్ ద్వారా, www.apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.