Modi – Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జాతీయస్థాయి రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ కూడా జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించి ఫ్రంట్ లు ఏర్పాటు చేశారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలు ఏకం కావడంలో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అయితే రాష్ట్రం నుంచి అధికారంలో ఉన్న వైసీపీ గాని, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని రాహుల్ గాంధీ విషయంలో స్పందించలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో పోటీ చేసిన చంద్రబాబునాయుడు ఈ విషయంలో కనీసం స్పందించకపోవడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు.. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీకి రావాల్సిన అవసరం ఉందని, గతంలో మాదిరిగా కేంద్ర స్థాయి రాజకీయాల్లో కీలకము కావాలని కోరారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం.
ప్రతిపక్షాలను సంఘటితం చేసిన చంద్రబాబు..
కేంద్ర స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను సంఘటితం చేసి పోరాటం చేయడంలో సఫలీకృతుడయ్యారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఆయన ఢిల్లీ వేదికగా రాజకీయాలు సాగించారు. ఆ స్థాయిలో చంద్రబాబుకు రాజకీయంగా పలుకుబడి ఉంది అన్నది ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. రాహుల్ గాంధీ విషయంలో దేశంలోని అన్ని పక్షాలు ఏకమయ్యాయి. మొన్నటివరకు కాంగ్రెస్తో కలిసి అడుగులు వేసిన చంద్రబాబు మాత్రం రాహుల్ విషయంలో ఇప్పటివరకు స్పందించలేదు. దీని వెనక అనేక రాజకీయపరమైన కారణాలు ఉన్నాయన్నది నిపుణుల మాట. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబుకు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు బిజెపిని విమర్శించే సాహసం చేయడం లేదు.
తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికలు చావో.. రేవో..
2019లో రాష్ట్రంలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తరువాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారయింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే పార్టీ మనుగడే కష్టం అన్న విధంగా పార్టీ పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు జాతీయస్థాయి రాజకీయాల కంటే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో రావడం ఏ లక్ష్యంగా పయనిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ భవితవ్యం మునిగిపోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు బిజెపితో సఖ్యత కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే కేంద్రంతో సత్యతగా ఉండాలని చంద్రబాబునాయుడు అభిప్రాయంతో ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి చంద్రబాబు దూరమయ్యారన్న విశ్లేషణలు ఉన్నాయి.
బిజెపితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నాలు..
2019 ఎన్నికలకు ముందు బిజెపి పై పోరాటం సాగించిన చంద్రబాబు.. ఆ ఎన్నికల్లో వచ్చిన ఓటమి తర్వాత పూర్తిగా మారిపోయారు. కేంద్రంలో బలంగా ఉన్న బిజెపితో వైరం కంటే.. మిత్రత్వంతోనే మేలు అన్న బావనకు చంద్రబాబునాయుడు వచ్చారు.. ఆ తర్వాత నుంచి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలను సాగిస్తూ వస్తున్నారు. అయితే ఆ ప్రయత్నంలో చంద్రబాబుకు కలిసి రావడం లేదు. బిజెపిలోని ఒక వర్గం చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు అంగీకరించడం లేదు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా విషయంలో చంద్రబాబు నాయుడు గతంలో వ్యవహరించిన తీరు, చేసిన విమర్శలను వారు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నంతకాలం రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందదు అన్నది వారి భావన. కష్టమైనా నష్టమైనా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి బలం సంపాదించుకోవడం ముఖ్యమన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
Web Title: Fear of modi future chaos chandrababus fear is the reason behind it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com