CM Jagan Cabinet: ఏపీ కేబినెట్ సమావేశానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ఏపీమంత్రుల్లో టెన్షన్ మొదలైందట.. తమ భవితవ్యం ఎలా ఉంటుందోనన్న ఆందోళన మంత్రుల్లో నెలకొందట.. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశానికి ప్రస్తుత మంత్రులకు చివరిది అని.. ఈ భేటిలో రాష్ట్ర మంత్రివర్గాన్ని పూర్తిగా పునరుద్దరించే తేదీని జగన్ ప్రకటిస్తారని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని 100శాతం మార్చాలని జగన్ నిర్ణయించడంతో మంత్రి మండలిలో తమకు ఇవి చివరి రోజులా అన్న బెంగ పట్టుకుందట.. పదవులు పొగొట్టుకుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందా? అని ఆందోళన చెందుతున్నారట..
సీఎం జగన్ ఇప్పటికే తొలి దఫా మంత్రులైన వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే మరికొందరికి తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా గెలిపించాలని కోరారు.
సీఎం జగన్ ముందుగానే నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని భావిస్తున్నారట.. అందువల్ల ప్రస్తుత మంత్రుల బృందానికి గురవారం నాటి సమావేశం చివరి కేబినెట్ సమావేశం కాకపోవచ్చని అంటున్నారట.. గురువారం జరిగే సమావేశంలోనే తమ మంత్రి పదవులు ఉంటాయా? ఊడుతుందా? అన్నది మంత్రులకు తెలియనుందని సమాచారం.
ఇప్పటికే కరోనా కారణంగా ఏడాదిన్నరగా మంత్రులు అసలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న పరిస్థితి. మంత్రులైనా ఆ ముచ్చట తీరలేదు.దీంతో మరో 6 నెలల సమయం అయినా తమకు ఇవ్వాలని మంత్రులంతా జగన్ ను అభ్యర్థించినట్టు సమాచారం. అయితే ఎన్నికలకు కొన్ని నెలలు ముందు మారిస్తే గొడవలు అవుతాయని.. ఇప్పుడే మారిస్తే కొత్త మంత్రులకు తగినంత అనుభవం వస్తుందని జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం.
ఇప్పటికే కొత్త మంత్రులను తీసుకోవాలని జగన్ రాజకీయ వ్యూహకర్త పీకే సూచించడంతో జగన్ కొత్త మంత్రివర్గ కసరత్తు చేసినట్టు తెలిసింది. సో ఈ మంత్రులకు ఇదే చివరి మంత్రివర్గ సమావేశం అవుతుందా? అన్న చర్చ మొదలైంది.