TRS: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచాక రాష్ట్ర ప్రజల్లో అధికార పార్టీపైనున్న నైరాశ్యం పెల్లుబుకుతోంది. ఇప్పటికే ఇచ్చిన హామీలను మరిచిన వ్యవహారమంతో అధికార పార్టీపై గుర్రుగా ఉన్న ప్రజలు ఆ పార్టీని నిలదీసేందుకు వెనుకాడటం లేదు. వరంగల్ ప్రజలు ఓ అడుగు ముందుకేసి టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభకు ఝలక్ ఇచ్చారు. ఆ సభకు తాము భూములివ్వబోమంటూ అక్కడి రైతులు తెగేసి చెప్పారు. దీంతో ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేసి రైతులపై జులుం ప్రదర్శించారు. వారి వెంటే వచ్చిన పోలీసులకు, రైతులకు తోపులాట సైతం జరిగింది.

10 లక్షల మందితో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో టీఆర్‌ఎస్ విజయగర్జన సభను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అక్కడి రైతుల పొలాల్లో స్థలాలను సేకరించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు వెళ్లారు. రైతుల పూర్తి అంగీకారం తీసుకోకుండానే పనులు ప్రారంభించారు. బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్‌విప్ వినరుభాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తోపాటు స్థానిక నేతలు టోల్‌గేట్ సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న రైతులు వారిని అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో పనులెలా చేస్తారని రైతులు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, స్థానిక నేతలతో కలసి రెండ్రోజులుగా తమ భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. బహిరంగ సభకు తమ భూములు ఇవ్వబోమని ఆందోళన చేపట్టారు. టీఆర్‌ఎస్ సభ కోసం పంటలు పండే తమ పొలాలను ఎట్టి పరిస్థితిల్లో ఇచ్చేది లేదని అక్కడి రైతులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోబోయిన రైతులను పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read: Teleangana Politics: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో ఏం జరగబోతుంది..?
ఈటల గెలుపుతో టీఆర్‌ఎస్‌పై నిరసన సెగలు
ఎంతో ఉత్కంఠ రేపిన హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు తెలంగాణలో రాజకీయ మార్పునకు శ్రీకారం చుడుతుందన్న చర్చలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే హుజూరా బాద్ ఉప ఎన్నికకు ముందు నుంచే టీఆర్‌ఎస్‌పై కొంత తిరుగు బావుటా స్టార్ట్ అయినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. చాలా మంది నాయకులు ఈటల లా తమను కూడా బయటకు పంపేస్తారేమోనన్న భయంతోనే పార్టీలో ఉంటూ వస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు ఎవ్వరూ ఎదురు చెప్పే సాహసం చేయలే క పోతున్నారు. ఎప్పుడు అయితే ఈటల పార్టీలో ఉన్నప్పుడు ధిక్కార స్వరం వినిపించారో అప్పుడు రసమయి బాలకిషన్ లాంటి వాళ్లు కూడా పార్టీ పై కొంత తిరుగు బాటు మాటలు మాట్లాడారు. ఈటల బయటకు వచ్చి కేసీఆర్ ను సవాల్ చేసి మరీ గెలిచారు. దీంతో ఇప్పుడు కేవలం పార్టీలోనే కాదు.. ప్రజల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌పై అనూహ్య రీతిలో తిరుగుబాటు స్టార్ట్ అయ్యిందన్న సంకేతాలు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడి 24 గంటలు కూడా కాకుండానే ఈ ఎఫెక్ట్ వచ్చేయడం టీఆర్‌ఎస్‌కు మింగుడుపడని అంశమే.
Also Read: Huzurabad By Election Result: వరుసగా ఏడోసారి ఈటల ఎలా గెలిచాడు? అసలు కారణాలేంటి?