https://oktelugu.com/

ముందు రైతు.. వెనక మోడీ..!

అన్నదాత ఆందోళనలతో దేశం మార్మోగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. దీంతో తాము రైతుల వైపు ఉన్నామో, లేదో నిరూపించుకోవాల్సిన పరిస్థితిని అన్ని పార్టీలూ ఎదుర్కొంటున్నాయి. అయితే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం మరింత సంకట స్థితిని ఎదుర్కొంటోంది. అటు సమర్థించలేక, ఇటు వ్యతిరేకించలేక అవస్థలు పడుతోంది. మరోవైపు.. టీడీపీ ఇదే అంశంపై టార్గెట్ చేస్తూ వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో.. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 05:37 PM IST
    Follow us on


    అన్నదాత ఆందోళనలతో దేశం మార్మోగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. దీంతో తాము రైతుల వైపు ఉన్నామో, లేదో నిరూపించుకోవాల్సిన పరిస్థితిని అన్ని పార్టీలూ ఎదుర్కొంటున్నాయి. అయితే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం మరింత సంకట స్థితిని ఎదుర్కొంటోంది. అటు సమర్థించలేక, ఇటు వ్యతిరేకించలేక అవస్థలు పడుతోంది. మరోవైపు.. టీడీపీ ఇదే అంశంపై టార్గెట్ చేస్తూ వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో.. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక అధికార పార్టీ మల్ల గుల్లాలు పడుతోంది.

    Also Read: సోషల్ మీడియలో అది ఫార్వర్డ్ చేస్తే నేరం!

    ఇరకాటంలో జగన్..
    రైతులు వ్యతిరేకిస్తున్న ఈ మూడు బిల్లులు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడే.. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. అయినా.. లోక్ సభలో తమకున్న బలంతో బీజేపీ వాటిని నెగ్గించుకుంది. అయితే.. రాజ్యసభకు వచ్చేసరికి కీలక మిత్రపక్షం అకాలీదళ్‌ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించింది. దీంతో ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. ఈ సమయంలోనే వైసీపీ, టీడీపీల నుంచి ఏడుగురు ఎంపీలు, మరికొందరు విపక్ష ఎంపీల మద్దతుతో ఈ బిల్లులను రాజ్యసభలోనూ ఎన్డీయే గట్టెక్కించుకుంది. మరి, నాడు పార్లమెంటులో మద్దతు ఇచ్చిన వైసీపీ ఇప్పుడు వ్యతిరేకించాలా? వద్దా? అనే విషయం తేల్చుకోలేక అవస్థలు పడుతోంది. తప్పని పరిస్థితుల్లో మంగళవారం నాటి “భారత్ బంద్” కు మాత్రం మద్దతు తెలపక తప్పలేదు. అయితే.. ఒకరోజు బంద్ కు మద్దతు తెలిపినప్పటికీ, ఈ చట్టాలపై తన పూర్తి వైఖరి ఏంటనేది స్పష్టం చేయాల్సి వస్తే.. ఏం చెబుతుంది అన్నదే ప్రశ్న.

    దాడి పెంచుతున్న టీడీపీ..
    వాస్తవానికి పార్లమెంటులో బిల్లులకు మద్దతుగా వైసీపీ, టీడీపీ రెండూ ఓటేశాయి. కానీ.. ఇక్కడ టీడీపీ కంటే అధికార పక్షంగా ఉన్న వైసీపీయే ప్రధానంగా టార్గెట్‌ అవుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుల్ని పూర్తిగా సమర్ధించారు. అంతేకాదు.. బిల్లుల్ని వ్యతిరేకించే పార్టీల నేతలను దళారులన్నారు. దీంతో.. ఓ దశలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు సాయిరెడ్డిని తిరిగి జైలు ఊచలు లెక్కబెట్టిస్తామని కూడా హెచ్చరించారు. టీడీపీ మాత్రం బిల్లులకు మద్దతిచ్చినా.. అందులో పలు మార్పులు సూచించింది. ఇప్పుడు టీడీపీ.. వాటినే అస్త్రంగా మార్చుకుంటోంది. 8వ తేదీ భారత్‌ బంద్ సందర్భంగా నాడు పార్లమెంట్ లో మాట్లాడిన వీడియోలను బయటపెట్టిన టీడీపీ.. వైసీపీ పై విమర్శలు గుప్పించింది. దీనికి కౌంటర్‌ ఇవ్వలేక మౌనంగా ఉండిపోయింది వైసీపీ. దీంతో ఇదే ఒత్తిడిని మరింత పెంచేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.

    Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

    నీవు నేర్పిన విద్యయే..
    టీడీపీ గతంలో కేంద్రంలోని బీజేపీ తో భాగస్వామిగా ఉంది. ఆ సమయంలో కేంద్రం మాట తప్పిన ప్రత్యేక హోదా అస్త్రాన్ని అందుకున్న జగన్.. టీడీపీని టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పిన బీజేపీ కంటే.. దాన్ని సాధించలేకపోతున్న టీడీపీని తూర్పార బట్టారు. రాష్ట్రంలో నిర్వహించిన ప్రతీ బహిరంగసభలోనూ టీడీపీని ఇదే అంశంపై టార్గెట్‌ చేశారు. చివరికి వైసీపీ ఒత్తిడి తట్టుకోలేక టీడీపీ కేంద్రానికి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. చివరికి గతేడాది శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యే వరకూ టీడీపీని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇదే విధంగా జగన్ ను టార్గెట్ చేయాలని టీడీపీ యోచిస్తోంది. వ్యవసాయ బిల్లుల అస్త్రంతో జగన్‌ను నిలదీస్తూ.. ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది.

    జగన్‌ ఏం చేస్తారు?
    పార్లమెంటులో కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించిన తరుణంలో వాటికి మద్దతిచ్చి చట్టాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన వైసీపీ.. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్న. భారత్ బంద్ కు మద్దతు ఇచ్చినప్పటికీ.. ఇది ఒకరోజు కోసం తీసుకున్న నిర్ణయమా..? లేక శాశ్వతంగా యూ టర్న్ తీసుకున్నట్టా? అన్నది తేలాల్సి ఉంది. కేసుల భయంతోనే.. జగన్ పార్టీ కేంద్రానికి మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. మరి, పూర్తిగా యూటర్న్ తీసుకుని, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే.. కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో అనే భయం వైసీపీలో ఉందనే చర్చ సాగుతోంది. అలాగని, మద్దతు కొనసాగిస్తే.. టీడీపికి అస్త్రాన్ని అందించడంతోపాటు, రైతుల్లో.. తద్వారా ప్రజల్లో వ్యతిరేకత పెంచుకున్నట్టే అవుతుందనే ఆందోళన కూడా అధికార పార్టీని వేధిస్తోందని టాక్. మరి, వైసీపీ అధినేతగా, ఏపీ ముఖ్యమంత్రిగా.. ఈ వ్యవసాయ చట్టాలపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్