Rythu Bharosa Kendralu: ‘మింగ మెతుకు లేదు..మీషాలకు సంపంగి నూనె’ అన్నట్టుంది ఏపీ ప్రభుత్వం దుస్థితి. నేలవిడిచి సాము చేయడం పరిపాటిగా మారింది. పాలనా పరమైన అంశాలను గాడిలో పెట్టడం మానేసి సంక్షేమ పథకాల మీట నొక్కడమే అలవాటు చేసుకున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా దిశగా తీసుకెళుతోంది. రాష్ట్ర భవిష్యత్ ను ప్రమాదంలోకి నెడుతోంది. నెలవారీగా రూ.6000 కోట్లు అప్పు పుడితే కానీ పాలనను సజావుగా నడిపించలేని స్థితిలోకి తెచ్చేసింది. అంతా నవరత్నాల మయమే. వాటికి నిధుల సర్దుబాటుతోనే పాలన సరిపోతోంది. ఒకవైపు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు నగదు బదిలీ చేస్తూనే.. తిరిగి పన్నుల, చార్జీల రూపంలో పిండేస్తున్నారు.
సంక్షేమమే గంతలు కట్టి నిలువునా దోచుకుంటున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. తన మానస పుత్రికలుగా చెప్పకునే రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాలకు గత పది నెలలుగా అద్దె చెల్లింపులు చేయలేదు. 2020 మే 30న రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 10,778 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 4,800 దాకా ఆర్బీకేలు అద్దె భవనాల్లోనే కొలువుతీరాయి. మిగతావి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ భవనాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ అద్దె భవనాలకు ఏడాది నుంచి అద్దెలు కట్టలేదు. కొందరికి 10 నెలలు, మరికొందరికి ఏడాదిన్నర నుంచి అద్దెలు రావాల్సి ఉందని చెబుతున్నారు. గడిచిన సంవత్సరానికి సంబంధించిన అద్దెల చెల్లింపులకు నిధుల విడుదలకు అధికారులు ప్రతిపాదనలు పంపినా.. ఆర్థిక శాఖ ఆమోదించలేదని సమాచారం. ఈ కారణంగానే సీఎంఎఫ్ ఎస్ లోని పాత బిల్లుల్ని వెనక్కి పంపేశారని చెబుతున్నారు. గతేడాది సీఎఫ్ ఎంఎస్ లో ఆమోదం పొందని ఈ బిల్లులను మళ్లీ అప్‌లోడ్ చేస్తుండటంతో నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఈ అద్దె బకాయిలు ఎప్పుడొస్తాయో స్థానిక అధికారులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల భవనాల యజమానులు ఆర్బీకేలకు తాళాలేస్తున్నారు. ఆర్బీకేలకు తాళాలు వేయడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతు సేవలకు ఆటంకం కలుగుతోందని సిబ్బంది చెబుతున్నారు. అద్దెలే చెల్లించలేని ప్రభుత్వం ఆర్బీకేలను ఎలా నడుపుతుందని భవన యజమానులు ప్రశ్నిస్తున్నారు.
అడుగుకు 5 రూపాయల అద్దె
చదరపు అడుగుకు ఐదు రూపాయలు చొప్పున వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం గల గదులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణం గల భవనాలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో లేని పరిస్థితుల్లో కాస్త అటుఇటుగా విస్తీర్ణమున్న భవనాలను అద్దెకు తీసుకున్నారు. వెయ్యి చదరపు అడుగుల భవనానికి నెలకు రూ.5వేలు, 500 చదరపు అడుగుల భవనానికి రూ.2,500 అద్దె కడుతున్నారు. ఈ విధంగా భవనాన్ని బట్టి అద్దెలు ఇవ్వాల్సి ఉంది. అధికారిక సమాచారం ప్రకారం గత 10 నెలలుగా అద్దె బకాయిలు ఉన్నాయి. ఈ లెక్కన 4,800 అద్దె భవనాలకు దాదాపు రూ.20 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కొందరు యజమానులకు ఏడాదిపైగా అద్దెలు అందాల్సి ఉంది. అద్దెలను యజమానుల ఖాతాలకే జమ చేస్తున్నారు. కానీ నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోతే.. భవనాలు అద్దెకిచ్చి ఉపయోగం ఏంటని యజమానులు మండిపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు చదరపు అడుగుకు 7, 8 రూపాయల చొప్పున అద్దెకు ఇస్తున్నామని, ప్రభుత్వానికి అంతకంటే తక్కువకే ఇచ్చినా అద్దె సక్రమంగా ఇవ్వడం లేదని వాపోతున్నారు.
నిరుడు 128 కోట్లు.. ఈసారి 18 కోట్లే
‘‘రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి గ్రామాల్లో ఆర్బీకేలు రైతు కార్యాలయాలుగా ఉంటాయి. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయిపట్టుకుని నడిపించేలా ఆర్బీకేలు పని చేస్తాయి. నాణ్యమైన ఉత్పాదకాల పంపిణీ, శిక్షణ, వ్యవసాయ విస్తరణ, ఉత్పత్తుల సేకరణ, విక్రయం, వ్యవసాయ సంబంధ సమీకృత సలహా కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తాయి’’ అని సీఎం జగన్ పలుమార్లు చెప్పారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 10,544, పట్టణ ప్రాంతాల్లో 234 అర్బన్ ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు సొంత భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.21.80 లక్షల చొప్పున కేటాయిస్తున్నామని ప్రకటించారు. 10,408 భవనాల నిర్మాణం చేపట్టారు. ఇందులో కొన్ని పూర్తి చేసి ప్రారంభించారు. ఆర్బీకేల బలోపేతానికి 2021-22లో రూ.128 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది 2022-23 బడ్జెట్‌లో కేవలం రూ.18 కోట్లే ప్రతిపాదించారు. దీంతో చాలీచాలని నిధులతో అద్దెలు చెల్లించడం లేదని సమాచారం.