హాయ్ దోస్త్ , అప్పుడే వారాంతం వచ్చేసింది. మనం బద్దకించినా కాలం ఆగదు కదా. గత రెండు , మూడు రోజుల్నుంచీ ఏ టీవీ పెట్టినా ట్రంప్ ముచ్చట్లే. అసలే తుంటరి, అయితేనేం అమెరికాకు అధ్యక్షుడు. ఇంకేం మరి టీవీ లకు మంచి పని దొరికింది. వున్నదీ లేనిదీ కలిపి వంట వారుస్తున్నారు. అఫ్ కోర్సు ట్రంప్ కి కూడా అదే ఇష్టం. స్వయానా తనే ఎన్నో గాసిప్పులు పోగుచేస్తుంటాడు, అందుకే మీడియా కి ట్రంప్ పెద్ద ఎస్సెట్. మనం ఆ జోలికి పోవద్దు. ఏదైనా వారాంతానికి సరిపడే టాపిక్ మాట్లాడుకుందాం.
ఈవారం మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఆర్ ఎస్ ఎస్ నేత మోహన్ భగవత్ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థని బలపరుచుకోవాలని ఉద్ఘాటించాడు. అంతవరకూ బాగానే వుంది. ప్రాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాల్లో అందునా భారత్ లో కుటుంబ వ్యవస్థ సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహంలేదు. అందుకు మన సంప్రదాయం , సంస్కృతి గురించి మనమంతా గర్వపడాలి కూడా. అంతవరకూ భగవత్ గారి అభిప్రాయంతో ఏకీభవిద్దాం. కానీ ఆతర్వాతే అసలు మసాలా జోడించాడు. అదేమిటంటే ఇటీవలి కాలంలో ఈ కుటుంబ వ్యవస్థ బలహీన పడుతుందని, విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్యా ఎక్కువవుతుందనీ సెలవిచ్చారు. దానితో కూడా మనం ఏకీభవించాలి. ఎందుకంటే అది అంకెల వాస్తవాల మీద ఆధారపడి వుంది కాబట్టి. చిక్కల్లా ఎక్కోడోచ్చిందంటే ఇలా కుటుంబ వ్యవస్థ బలహీనం కావటానికి , విడాకులు ఎక్కువ కావటానికి కారణం చదువుకున్న వాళ్లేనని . ఓకే, అదికూడా అంకెల్ని బట్టి వాస్తవమే కాబట్టి ఒప్పుకోక తప్పదు. మరి మీరడగొచ్చు ఇంకేంటి సమస్య అని? వస్తున్నా వస్తున్నా అసలు విషయానికి.
ఇలా జరగటానికి కారణం విద్యావంతుల్లో గర్వం పెరగటమని సెలవిచ్చారు! అవునా అని నోటి మీద వేలేసుకోవటం మనవంతయింది. మీకేమనిపిస్తుంది ? నిజమేనంటారా? అఫ్ కోర్స్ చదువుతో పాటు అధికాదాయం కూడా ఒక కారణమన్నారు. నిజమేననుకుందాము. మరి చదువులేని వాళ్ళ మాటేమిటి? వాళ్ళందరూ భార్య, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా? నా చిన్నప్పుడు మా ఊళ్ళోనే మా బంధువు ఒకాయన భార్యను గొడ్డును బాదినట్లు బాదేవాడు. అయినా కుటుంబం చక్కగానే వుంది! కారణం గర్వం లేకపోవటమేనంటారా భగవత్ గారూ? కుటుంబ వ్యవస్థ బలపడాలని కోరుకోవటం అభినందించదగ్గదైనా ఇందులో విద్యని, సంపదని తీసుకురావటంలో ఔచిత్యమేమిటో సెలవిస్తారా? విద్యతో బాటు మన సంప్రదాయాన్ని, సంస్కృతి ని అలవరచుకోమని, పాటించమని చెప్పటం దాని సారాంశమయితే అభినందిద్దాం. కానీ చదువుకోని వారు కుటుంబ వ్యవస్థని కాపాడుతున్నారు, చదువుకున్న వాళ్ళు చెడగొడుతున్నారనే అర్ధం ధ్వనించటం అశాస్త్రీయంగా వుంది మహాశయా .
భగవత్ గారు నాణేనికి ఒక వైపే చూస్తున్నట్లుంది. రెండో వైపు కూడా చూస్తే బాగుంటుంది. విద్య, వుద్యోగం వలన సాధికారతతో మహిళలు ఆలోచిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు. భగవత్ గారు చెప్పిన వాళ్ళు కొంత శాతం ఉండొచ్చేమో గానీ ఎక్కువ మంది పురుషాధిక్యతను భరించలేకే తప్పనిపరిస్థితుల్లో బయటకు వస్తున్నారని ఎందుకు ఆలోచించరు? ఒకనాడు భర్త ఏమిచేసినా , పచ్చిగా పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఎంతమందితో తిరిగినా భార్య గమ్మున నోరుమూసుకుని కూర్చునేది? భర్త తిట్టినా కొట్టినా పడివుండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకొని అన్యోన్యంగా ఉన్నచోట్ల కుటుంబం మూడు పూవులు , ఆరు కాయలుగా ఉంటుంది. అలాకాకుండా ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించినా సమస్యలు వస్తున్నాయి. అయితే ఇక్కడే సహనం ఉండాలి. ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటిగా వుండవు. స్వంత అన్నదమ్ములు, అక్కాచెల్లిళ్లలోనే తరతమ బేదాలున్నప్పుడు బయటినుంచి వాళ్ళు కుటుంబ వ్యవస్థలో ఎదగటానికి టైం పడుతుంది. సహనమే కుటుంబ వ్యవస్థకి శ్రీరామ రక్ష.
ఎక్కువభాగం వారసత్వంగా వచ్చిన పురుషాధిక్య సమాజ ధోరణుల వలనే పొరపచ్చాలు వస్తున్నాయని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవముంది. తరతరాలుగా వున్న ఆచారాల్లో మహిళలకు సమాన హోదా లేదు. ఇది అన్ని సమాజాల్లో , అన్ని మతాల్లో కూడా చూస్తున్నాం. అందుకే యుగపురుషుల అవసరం ఎంతయినా వుంది. ఒక ఈశ్వర చంద్ర విద్యా సాగర్, ఒక రాజా రామమోహన్ రాయ్ , ఒక కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్తలుగా అవతరించారు. ఇంకా ముందుకెళ్తే ఒక గౌతమ బుద్ధుడు , ఒక మహావీరుడు, ఒక గురు నానక్ అవతరించారు. అలాగే యూరప్ లో వచ్చిన పునరుజ్జీవన ఉద్యమం క్రైస్తవ సమాజంలో పెనుమార్పులు తెచ్చింది. మహిళకు సమాన గౌరవం తీసుకొచ్చింది. ఇస్లాం సమాజంలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఖలీఫా వ్యవస్థని రద్దుచేసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమల్ అటాటర్క్ టర్కీ లో మహిళల సమానత్వం కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది యుగకర్తలు లింగ సమానత్వం కోసం , సామాజిక మార్పుకోసం పనిచేసారు. అయినా ఈరోజుకి మహిళలు వేధింపులకు గురవుతూనే వున్నారు. కుటుంబ వ్యవస్థ బలపడాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు, ధోరణలు మారాలి. స్త్రీలు మనలో సగమని గుర్తించాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. అదేసమయంలో పెడధోరణలు, పిడి ధోరణులతో ప్రవర్తించే మహిళలు కూడా మారాలి. జీవితమనేది ఇద్దరూ ఒకరినొకరు అర్ధంచేసుకుని చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే కుటుంబ వ్యవస్థకు అర్ధం , పరమార్ధం .
ప్రాశ్చాత్య సమాజానికి , మనకు వున్న తేడా పిల్లల పెంపకం విషయంలో. అక్కడ ఒక వయసు రాగానే వాళ్ళు ఇంటినుంచి బయటికి పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా అదే నేర్పిస్తారు. మనం దానికి భిన్నం. కనీసం పెళ్లి అయ్యేదాకా , ఆ తర్వాత కూడా కలిసివుండటానికే ప్రయత్నిస్తాం. పిల్లల బాగోగుల కోసం మనం అహర్నిశం శ్రమిస్తాం. పిల్లలు పెద్దయిన తర్వాత తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రయత్నిస్తారు . ఇది మన సాంప్రదాయ ఔన్నత్యం. అందుకనే కుటుంబ వ్యవస్థ ను జాగ్రత్తగా కాపాడుకోవటం మనందరి భాద్యత. ఆ నేపథ్యంలోనే భగవత్ గారు కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలని నొక్కి వక్కాణించారు. కానీ దానితోపాటు మనం పైన మాట్లాడుకున్నట్లు ఆలోచనా ధోరణలు, లింగ సమానత్వ భావాలు పెంపొందించుకుంటేనే కుటుంబ వ్యవస్థ నిలబడుతుందని చెప్పివుంటే బాగుండేది. కానీ విద్యవలన అనర్ధాలు వస్తున్నాయనే భావం సరికాదు. ఏదిఏమైనా భగవత్ గారి స్పిరిట్ ని తీసుకుందాం. కుటుంబ వ్యవస్థను బలపరుద్దాం.
ఇదీ ఈవారం ముచ్చట్లు , వచ్చే వారం మళ్ళీ కలుద్దాం , సెలవా మరి.
……. మీ రామ్
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Families destroyed due to arrogance
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com