
తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో వేలాదిగా దొంగ ఓట్లు వేశారని, అధికార పార్టీ భారీగా అక్రమాలకు పాల్పడిందని విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏకంగా నకిలీ ఓటరు ఐడీ కార్డులను సైతం ముద్రించి దొంగ ఓట్ల వేయించేందుకు వైసీపీ నేతలు తెగబడ్డారని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు.
అంతేకాదు.. ఇందుకు సంబంధించి పలు ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. లోక్ సభ నియోజకవర్గం పరిధిలో.. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీంతో.. కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న నెల్లూరు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబును నివేదిక ఇవ్వాలని సూచించింది. విచారణ చేపట్టిన చక్రధర్.. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు రిపోర్టు పంపించారు. ఈ మేరకు ఆయనే స్వయంగా వివరాలు వెల్లడించారు.
మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మైక్రో అబ్జర్వర్ల ద్వారా నివేదికలు తెప్పించుకొని, అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత కౌంటింగ్ వివరాలను కూడా వెల్లడించారు. కౌంటింగ్ గురించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడించడంతో.. రీ-పోలింగ్ లేదనే విషయం తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాకుండా.. టీడీపీ నేత అచ్చెన్నాయుడు చక్రధర్ బాబుపై విమర్శలు గుప్పించారు. అత్యంత పారదర్శకంగా తిరుపతి ఎన్నిక జరిగినట్టు చెబుతున్నారని అన్నారు. దీంతో.. నివేదికలో ఎలాంటి అక్రమాలు జరగలేదనే రిపోర్టే వెళ్లి ఉంటుందని నేతలు భావిస్తున్నారు.