Dharmana Vs Kinjarapu: కింజరాపు,ధర్మాన కుటుంబాల మధ్య ముఖాముఖి పోటీ.. నమ్మడం సాధ్యమేనా?

ధర్మాన సోదరుల్లో వైసీపీ నాయకత్వానికి ఇష్టుడైన నేతగా కృష్ణదాసుకి పేరు ఉంది. వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి తన కుమారుడు కృష్ణ చైతన్యను బరిలోదించాలని కృష్ణదాస్ ప్లాన్ చేశారు.

Written By: Dharma, Updated On : August 7, 2023 3:21 pm

Dharmana Vs Kinjarapu

Follow us on

Dharmana Vs Kinjarapu: వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైసిపి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. గత రెండు ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు స్ట్రాంగ్ లీడర్ గా ఎదిగిపోయారు. గత ఎన్నికల్లో లోక్సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గాను.. ఐదింట టిడిపి ఓడిపోయినా రామ్మోహన్ నాయుడు మాత్రం ఎంపీగా గెలిచారు. అది కింజరాపు కుటుంబ చరిష్మతోనే గెలుపొందారు అన్న టాక్ ఇప్పటికీ ఉంది. అందుకే అక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దించి రామ్మోహన్ నాయుడుని పడగొట్టాలన్నది జగన్ వ్యూహం.

అయితే ఈసారి మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఎంపీ గా బరిలో దిగుతారని టాక్ నడుస్తోంది. కృష్ణ దాస్ జగన్ కు అత్యంత విధేయుడు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైసీపీ కన్వీనర్ గా ఉన్నారు. జగన్ తన తొలి మంత్రివర్గంలో కృష్ణ దాస్ కు చోటిచ్చారు. సోదరుడు ధర్మాన ప్రసాదరావు కంటే కృష్ణదాస్ కి ఎక్కువ విలువ ఇచ్చారు. కానీ విస్తరణలో సోదరుడి కోసం మంత్రి పదవి నుంచి కృష్ణ దాస్ తప్పుకున్నారు. అప్పటినుండి పార్టీ జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందుతానన్న ధీమాలో కృష్ణదాస్ ఉన్నారు. ఇటీవల తన మనసులో ఉన్న మాటను వ్యక్తపరిచారు. జగన్ ఆదేశిస్తే శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

ధర్మాన సోదరుల్లో వైసీపీ నాయకత్వానికి ఇష్టుడైన నేతగా కృష్ణదాసుకి పేరు ఉంది. వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి తన కుమారుడు కృష్ణ చైతన్యను బరిలోదించాలని కృష్ణదాస్ ప్లాన్ చేశారు. కానీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరోవైపు శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైతే ధర్మాన సోదరులతో పాటు తమ్మినేని పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ సమయంలో కృష్ణదాస్ వ్యూహాత్మకంగా ప్రకటన చేశారు. తాను ఎంపీగా,కుమారుడు నరసన్నపేట ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామని హై కమాండ్ కు సంకేతాలు పంపారు.

కింజరాపు,ధర్మాన కుటుంబాల మధ్య రాజకీయ అవగాహన ఉందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. రాజకీయంగా పరస్పరం సహకారం అందించుకుంటారని శ్రీకాకుళం వర్గాల్లో వినిపిస్తుంటుంది. క్రాస్ ఓటింగ్ మూలంగానే ఆ రెండు కుటుంబాలు పదవులు పొందుతున్నాయని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కృష్ణ దాస్ ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం విశేషం. అయితే హైకమాండ్ ఈ విన్నపాన్ని ఒప్పుకుంటుందో లేదో చూడాలి మరి.