Eenadu: ఈనాడుకు.. తెలుగు ప్రజలకు దాదాపు 40 ఏళ్ల అనుబంధం. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు అది ఏది రాస్తే అదే నిజం. అది ఏది తప్పు అని చెబితే అదే తప్పు. అది ఏది ఒప్పు అని చెబితే అదే ఒప్పు. సారా వ్యతిరేక ఉద్యమం నుంచి ఈనాడుకు అలవాటు పడిపోయిన తెలుగు పాఠకులు ఇప్పటికీ ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నారు. మార్గదర్శి కుంభకోణం, సీతమ్మధార స్థల విభాగం.. అబ్దుల్లాపూర్ మెట్ అసైన్డ్ స్థలాల ఆక్రమణ.. ఇలా ఎన్ని రకాల విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఈనాడు ఇంకా మొదటి స్థానంలో (పోటి పత్రికల బేలతనమది) కొనసాగుతూనే ఉంది. తను ఎన్ని తప్పులు చేసినప్పటికీ పాఠకులు ఆదరిస్తున్నారనే సోయి ఆ పత్రిక యాజమాన్యానికి లేకపోవడం విశేషం. కేవలం ఒక సెక్షన్ పార్టీకి, ప్రజలకు అనుకూలంగా వార్తలు వడ్డించే ఈనాడు.. వైద్య విద్యకు సంబంధించి పీజీ సీట్లలో కేటాయింపులకు సంబంధించి అడ్డగోలుగా రాసింది. కానీ అసలు విషయం తెలుగులోకి వచ్చేసరికి బేల చూపులు చూస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో పీజీ వైద్య విద్యకు సంబంధించి జరిగిన అవకతవకలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ఈ వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నేషనల్ మెడికల్ కమిషన్ కు లేఖ కూడా రాసింది. వైద్య విద్యకు సంబంధించి అదనపు పీజీ సీట్ల మంజూరులో భారీగా డబ్బులు చేతులు మారాయని నేషనల్ మెడికల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది (ఈ విషయాన్ని సాక్షి చెప్పుకోలేకపోయింది అది దాని దురదృష్టం.. సంబంధిత వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా వివరణ ఇవ్వలేకపోయింది). ఇంకేముంది ఈనాడు దర్జాగా ఆ విషయాన్ని పసిగట్టి.. ఇక్కడే కుంభకోణానికి తెర లేచింది అని రాసింది.. సీట్ల టెంపుల్ పై నకిలీ లెటర్ ఆఫ్ పర్మిషన్ సృష్టించారని, ఈ వ్యవహారంలో వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కళ్ళు మూసుకుని రాసేసింది.
సరే ఈనాడు పత్రిక ప్రమాణాలు ఏ విధంగా పడుతున్నారు గతంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఈసారి కూడా ఈనాడు అంతకుమించి అనే స్థాయిలో పీజీ వైద్య విద్యకు సంబంధించి సీట్ల కేటాయింపుల విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శించింది. సమాజంలో న్యూట్రల్ గా ఉండాల్సిన విలేకరులు ఒక పార్టీకి డప్పు కొడితే ఎలా ఉంటుందో అలానే ఉంది ఈ కథనం. వాస్తవానికి పీజీ వైద్య విద్య సీట్ల పెంపు జాతీయ మెడికల్ కమిషన్ పరిధిలో ఉంటుంది. అలాంటప్పుడు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏముంటుంది? వాస్తవానికి ఈ వ్యవహారం వెలుగు చూసింది శాంతిరాం మెడికల్ కాలేజీలో.. ఈ శాంతిరాం మరెవరో కాదు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారుడు. 2019లో ఈయన సంస్థలపై ఐటి దాడులు జరిగాయి. అప్పుడు దీనిని లోకేష్ ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలనే దాడులు చేయిస్తున్నారని ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. కానీ ఇదే శాంతిరాంను ఈనాడు వైఎస్ఆర్సిపికి అంటగట్టే ప్రయత్నం చేసినట్టు తన రాతల్లో కనిపిస్తోంది. ఇదే ఈనాడు అప్పుడు లోకేష్ చేసిన ట్వీట్ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. అంతేకాకుండా నంద్యాల శాంతిరాం కాలేజీలో జరిగిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే జాతీయ వైద్య కమిషన్ కు లేఖ రాసింది. మరి ఈ విషయాలు మర్చిపోయిన ఈనాడు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ కుంభకోణం జరిగిందని రాయడం దురదృష్టకరం. ఇదే సమయంలో తమిళనాడులోనూ ఇలాంటి వ్యవహారం వెలుగులోకి రావడం.. దానిని ఈనాడు విస్మరించడం గమనార్హం..