ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అయితే.. సింహభాగం ప్రజలు ఇది రాజకీయ కక్షేననే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి కారణం లేకపోలేదు.. అంతకు ముందు మల్లారెడ్డి వంటి మంత్రులు సహా.. ఎంతో మంది టీఆర్ఎస్ నేతలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయినా.. పట్టించుకోని కేసీఆర్.. ఈటలపై ఫిర్యాదులు రావడంతోనే.. విచారణ, నిర్ధారణ, శాఖ మార్పు బర్తరఫ్, రెండు రోజుల్లోనే పూర్తిచేశారు. దీంతో.. ఇది టార్గెట్ చేసిన బాపతేనన్న అభిప్రాయం బలపడింది.
ప్లాన్ ప్రకారం ఈటలను పక్కకు తప్పించారని భావించిన నేతలంతా.. ఆయన ఇంటికి వెళ్లి మరీ సానుభూతి ప్రకటించి వచ్చారు. వీరిలో.. ఉద్యమం తర్వాత నిరాదరణకు గురైన నేతలే ఎక్కువగా ఉన్నారట. తాజాగా.. మాజీ టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలతో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
మేడ్చల్ లోని ఈటల స్వగృహంలో వీరిద్దరూ కలిశారు. అయితే.. తమ మీటింగ్ రాజకీయపరమైనది కాదని చెప్పారు కొండా విశ్వేశ్వర రెడ్డి. ఈటల భార్య బంధువని, ఆ విధంగా చుట్టపు చూపుగానే ఈటలను కలిసినట్టు తెలిపారు. మంత్రి వర్గం నుంచి తొలగించడం పట్ల సానుభూతి తెలిపానన్నారు. అయితే.. బయటకు ఏం చెప్పినా.. లోపల మాత్రం ఖచ్చితంగా రాజకీయ చర్చ జరిగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే కొండా కలవడంతో.. ఇద్దరూ కలిసి పార్టీ ప్రకటిస్తారా? అనే చర్చ సాగుతోంది. గులాబీ గూటిలో ఇమడలేకపోయిన వాళ్లంతా కలిసి కొత్త పార్టీ పెడతారని బలంగా వినిపిస్తోంది. ఇటు జనాల్లోనూ ఈటలపై సింపతీ వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి.
దీంతో.. ఈటల పార్టీ పెట్టడం ఖాయమని అంటున్నారు. ఆత్మగౌరవ నినాదంతో ముందుకు సాగుతున్న ఆయన వెంట.. పలువురు మాజీ టీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు కలిసి వస్తారని చెబుతున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది తెలియాలంటే.. మరొకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.