
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఒక్క రోజు కూడా గడవకుండానే.. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. లోపాయికారి ఒప్పందంతోనే ఈటలను బీజేపీలో చేర్చారని, దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు రేవంత్. ఈ స్టేట్ మెంట్లో ప్రత్యేకత ఏమీ కనిపించకపోవచ్చు. ఇదో సాధారణ రాజకీయ విమర్శగానే అనిపించొచ్చు. నిజానికి అందరూ అలాగే తీసుకునేవారేమో.. కానీ ఒకే ఒక్క ప్రశ్నతో అందరిలోనూ అటెన్షన్ క్రియేట్ చేశారు రేవంత్.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం సమకూర్చింది ఎవరు? అని ప్రశ్నించారు రేవంత్. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో చేరడానికి ముందు కిషన్ రెడ్డి, ఈటల ఓ ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడుకున్నారని, ఈ చర్చల కోసం ఆ రోజు రాత్రి ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో వచ్చారని, ఈ విమానం ఏర్పాటు చేసింది కేసీఆరే అని ఆరోపించారు రేవంత్.
అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి, ఆ విమానం తెలంగాణకే చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్తదని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన 2 లక్షల కోట్ల రూపాయల పనులను ఆ సంస్థ నిర్వహిస్తోందని కూడా అన్నారు. ఆ విమానం యజమానికి, కేసీఆర్ కు ఉన్న సంబంధం ఏంటో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
బీజేపీలోకి ఈటలను తోలింది కేసీఆరే అని సాధారణ కామెంట్ చేస్తే.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ.. ఫామ్ హౌస్ ముచ్చట్లు మొదలు.. విమానం సమకూర్చడం వరకు రేవంత్ చెప్పడం, అది కూడా తెలంగాణకు చెందిన వ్యాపార వేత్తదనే మాట కూడా ఉపయోగించడంతో.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ లేదా టీఆర్ఎస్ నుంచి సరైన సమాధానం రాకపోతే మాత్రం.. రేవంత్ చెప్పిన మాటలు వాస్తవమే అనే అభిప్రాయం బలపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇదే జరిగితే.. ఇటు కేసీఆర్, అటు బీజేపీ ఇరకాటంలో పడిపోతాయి. ఫస్ట్ బంతినే సిక్స్ కొట్టిన రేవంత్.. దూకుడుగా గేమ్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. పించ్ హిట్టర్ అంటూ.. సీనియర్లను సైతం పక్కన పెట్టిమరీ కెప్టెన్సీ అప్పజెప్పినందున.. వీరవిహారం చేసేందుకే రేవంత్ ప్రయత్నిస్తాడని చెప్పడంలో డౌటే లేదు. దీన్ని అడ్డుకునేందుకు గులాబీ దళం ఏం చేస్తుంది? దానికన్నా ముందు.. ఆ విమానం గురించిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతుందన్నది చూడాలి.