‘‘ఎవరినైనా టార్గెట్ చేస్తే.. వాళ్లను ఎలా ఖతం పట్టిస్తారో నాకు తెలుసు’’ ఇదీ.. కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్య. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత మీడియా సమావేశంలో ఈ మాట అన్నారు. అదే సందర్భంలో తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని కూడా ప్రకటించారు. దీంతో.. కేసీఆర్-ఈటల యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తమైంది.
అయితే.. ఈటలను ఎటూ కదలకుండా పద్మవ్యూహంలో బంధించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటలపై ఉద్దేశపూర్వకంగా దాడిచేశారనే చర్చ జనాల్లో ఉన్నప్పటికీ.. అధికారికంగా మాత్రం ఆయన అసైన్డ్ భూములు, దేవాదాయ భూముల విషయంలో తప్పు చేశాడని చెప్పడంలో సఫలమైంది టీఆర్ఎస్. ఆ విషయాన్ని చూపుతూ మంత్రివర్గం నుంచి కూడా తొలగించింది. ఇక, మిగిలింది పార్టీ నుంచి పంపడమే.
కోరలన్నీ పీకేసిన తర్వాత ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఉన్నది టీఆర్ఎస్ ఎత్తుగడ కావొచ్చు. పైగా.. ఇలా ఉండడం వల్ల ఈటలకే నష్టం. ఈ విషయం వేడిమీద ఉన్నప్పుడే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం ఈటలకు కల్పించింది. లేకపోతే.. వేడి చల్లారిన తర్వాత పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. జనాలు కూడా మరిచిపోతారు. అందువల్ల పార్టీ నుంచి అధిష్టానం తొలగించడం అనేది జరగకపోవచ్చు. దీంతో.. ఇప్పుడు బంతి ఈటల కోర్టులోనే ఉంది.
ఈ విషయం ఈటలకు తెలియనిది కాదు. అయితే.. కేవలం పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవిని ఉంచుకోలేడు. టీఆర్ఎస్ గుర్తుపై గెలిచాడు కాబట్టి.. రెండింటికీ రాజీనామా చేయాలి. అలా చేస్తే.. రాబోయే ఎన్నికల్లో నిలబడాలి. అధికార పార్టీతో కలబడాలి. గెలిచి మళ్లీ నిలవాలి. అది సాధ్యం కావాలంటే ఎన్నో వ్యూహాలు అమలు చేయాలి.
ఇతర పార్టీల అభ్యర్థిగా కాకుండా సింగిల్ గా నిలబడి టీఆర్ఎస్ ను ఢీకొనడం అనేది తేలికైన విషయం కాదు. ఈటలను ఓడించడానికి అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతుందనడంలో సందేహమే లేదు. ఒకవేళ ఈటల గెలిస్తే.. ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఆరు నూరైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఈ విషయం తెలిసిన ఈటల.. ఇతర పార్టీల మద్దతు కోరుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలను కలిసిన ఈటల.. వారి మద్దతు కోరినట్టు సమాచారం. కానీ.. ఆ పార్టీల నుంచి హామీ లభించలేదనే ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలుగా ఉన్న రెండూ.. తమ అభ్యర్థిని నిలబెట్టకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనేది జరగకపోవచ్చు. అలా చేస్తే.. ఆ పార్టీలకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. కాబట్టి.. ఈ వైపు నుంచీ ఈటలకు మద్దతు కష్టమే. మొత్తంగా అన్ని వైపుల నుంచి బంధనాలు వేసి.. యుద్ధంలోకి ఈటలను పద్మవ్యూహంలోకి ఆహ్వానిస్తోంది టీఆర్ఎస్. మరి, దీన్ని ఈటల ఎలా ఛేదిస్తారన్నది ఆసక్తికరం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Etela rajender in padmavyuha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com