హుజురాబాద్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దీంతో రెండు పార్టీలు దూకుడు మీద ఉన్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రచారం ముమ్మరం చేశాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etela Rajender) మాత్రం ఒంటరి పోరుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ తోనే తాను ఎన్నికల్లో గెలుస్తానని భావిస్తున్నారు. అందుకే బీజేపీ నేతలను తన వెంట ఉంచుకోవడం లేదనే విషయాలు స్పష్టం అవుతున్నాయి.
హుజురాబాద్ లో ప్రత్యేకంగా బీజేపీకి ఓటు బ్యాంకు లేదు. కార్యకర్తల బలం కూడా తక్కువే. దీంతో ఈటల రాజేందర్ తన పంథా మార్చుకున్నారు. దుబ్బాకలో మాదిరిగానే వ్యక్తిగత ఇమేజ్ తోనే ఎన్నికల్లో విజయడంకా మోగించాలని భావిస్తున్నారు. అందుకే బీజేపీలో పెద్ద నేతలను సైతం తన ప్రచారానికి ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. బీజేపీపై ఉన్న వ్యతిరేకత కూడా తన గెలుపుకు ప్రతిబంధకంగా మారే సూచనలున్నాయని భావించి ఈటల ఈమేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బీజేపీ నేతల ప్రచారంతో తనకు పెద్ద ప్రయోజనం ఉండదని భావించిన ఈటల ఒంటరిగానే ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలతో ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వారి సహాయం అవసరం లేదని నిర్ణయించుకున్నారు. అందుకే ఒంటరిగానే పాదయాత్ర(Padayatra) చేపట్టారు. అయితే అనారోగ్య కారణాలతో పాదయాత్ర మధ్యలో ఆపేసినా మళ్లీ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ప్రచారంలో ఈటల తన సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళుతున్నారు. అగ్రనేతల సహాయం కూడా తీసుకోవడం లేదు. ఒక మాజీ ఎంపీ వివేక్ మాత్రమే ఆయన వెంట ఉంటున్నారు తప్ప మరే నేత కూడా ఈటలతో రావడం లేదు. నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా ఉన్న బలాలను అంచనా వేసుకుని వారి మద్దతు కోసమే ఈటల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం తమదేనన్న విశ్వాసంతో ముందుకు వెళుతున్నారు. సానుభూతి పవనాలతోనే తనకు విజయం తథ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల ప్రభావం ఎంత మేర ఉంటుందో వేచి చూడాల్సిందే.
అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం దళిత బంధు పథకంతో ప్రయోజనం పొందాలని భావిస్తున్నా అది క్షేత్రస్థాయిలో ఇంకా వ్యతిరేక పవనాలు వీచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కేసీఆర్ మాత్రం తన మార్కు నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే దళితబంధు పథకం తెచ్చారని భావిస్తున్నారు. అయినా అధికార పార్టీకి విజయం అంత తేలికగా ఉండదనే విషయం బోధపడడంతోనే ఇలా పథకాల పాట అందుకుంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.