CM Jagan: గత ఎన్నికలు ఒక ఎత్తు.. ఈ ఎన్నికలు మరో ఎత్తు. అప్పటిలా ఏకపక్ష విజయమంటే ఏపీలో జగన్ కు కుదిరే పని కాదు. దాదాపు అసాధ్యం కూడా. ఉద్యోగులు; ఉపాధ్యాయులు దూరమయ్యారు. శత్రువులుగా మారారు. జగన్ సర్కారును గద్దె దింపాలన్న నిర్ణయాకి వచ్చారు. అందు కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కంటే ఇప్పుడు వారే కసితో ప్రయత్నిస్తున్నారు. ఒక ఐదేళ్లు ముందుకు వెళితే ఇదే ఉద్యోగులు, ఉపాధ్యాయులు జగన్ కు అండగా నిలిచారు. నాటి చంద్రబాబు సర్కారుపై ఊరూ వాడ దుష్ప్రచారం చేశారు. ఉద్యోగి కళ్లల్లో ఆనందం చూస్తేనే వారు బాగా పనిచేస్తారని.. వారికి అన్నిరూపాల్లో సంతృప్తి పరుస్తామని జగన్ చెప్పేసరికి వారికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏకంగా వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు. దగ్గరుండి ఓట్లు వేయించారు. కొన్ని ప్రాంతాల్లో స్వయంగా వారే వేసినట్టు వార్తలు వచ్చాయి. మొత్తానికి తాము అనుకున్నట్టు జగన్ కొలువుదీరారు. తాము అనుకున్న ముచ్చట ఏదీ కనిపించకపోయేసరికి ఇప్పుడు ఆ రెండు వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయాయి.

అయితే జగన్ కూడా ఆ రెండు వర్గాలను ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తోంది. వారిపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. చివరకు వారి జీతాలు కూడా లేట్ చేస్తున్నారు. జీతాలన్నక వారం పదిరోజులు ఆలస్యమవుతాయి. దానికే అంత రాద్ధాంతమా అంటూ కొందరు మంత్రులు వ్యాఖ్యానించే దాక పరిస్థితి వచ్చింది. అటు పథకాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బాధితుల సంఖ్య పెరుగుతోంది. పింఛన్లు, రేషన్ కార్డలు.. ఇలా ఏది పడితే అది కోసేస్తున్నారు. ఇలా కోతకు గురైన వారంతా ప్రభుత్వ వ్యతిరేకులుగా మారక తప్పదు. అటు ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది వైసీపీ సర్కారు మరోసారి అధికారంలోకి రాకూడదన్న భావనతో ఉన్నారు. ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాలన్న దృడ నిశ్చయానికి వచ్చారు. అందుకే కాబోలు వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన సానుభూతి ఓట్లు సైతం పడడమే వైసీపీ గెలుపునకు కారణమని విశ్లేషణలు వెలువడ్డాయి. బీజేపీని విభేదించి చంద్రబాబు కాంగ్రెస్ తో కూటమి కట్టారు. ఏపీలో బీజేపీని మరింత నైరాశ్యంలో పెట్టేశారు. దీంతో బీజేపీ వైసీపీకి లోపయికారీగా సహకారమందించింది. అటు జనసేనకు సంబంధించి కాపు ఓటు బ్యాంక్, పవన్ అభిమానులు సైతం స్థానిక రాజకీయాల కారణంగా వైసీపీ అభ్యర్థులకే ఓట్లు వేశారు. వైసీపీ గెలుపునకు దోహదపడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో అవి వర్కవుట్ అయ్యే అవకాశం లేదు. పవన్ ఈ ఓట్లను వైసీపీకి దూరం చేసేందుకు ముందుగానే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనను అభిమానించి వెంట నడిచేవారు తప్పనిసరిగా ఓటర్లుగా మారాలని ఆయన పదేపదే పిలుపునివ్వడం అందులో భాగమే.

మరోవైపు పవన్ ను పదే పదే తిట్టడం, వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడం కూడా వైసీపీకి మైనస్ గా మారుతోంది. వైసీపీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉండే వారు సైతం దూరమవుతున్నారు. పవన్ ను అభిమానిస్తూనే వైసీపీ ఓటర్లుగా ఉన్నవారూ ఉన్నారు. వారంతా పవన్ అంటే ఇష్టమని చెబుతుంటారు. కానీ రాజకీయంగా వైసీపీ వైపే ఉంటామంటారు. పవన్ ను పర్సనల్ గా టచ్ చేసే సరికి వారిలో కూడా మార్పు వస్తోంది. తాము అభిమానించే నాయకుడ్ని తిట్టేసరికి వారు కూడా ఇబ్బందిపడుతున్నారు. రాజకీయంగా పవన్ కు అండగా నిలిచేందుకు డిసైడ్ అవుతున్నారు. మొత్తానికి గత ఎన్నికల్లో అభిమానించి, ఆదరించిన వర్గాలు వైసీపీకి దూరమవుతున్నాయి. బాధిత వర్గాలన్ని శత్రువులుగా మారుతున్నాయి. అందుకే ఈసారి వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు.