
Elon Musk : ఎలన్ మస్క్ మళ్లీ నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు. ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు.. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ రియల్ టైం ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 28 నాటికి మస్క్ వ్యక్తిగత ఆస్తి మరో 698 కోట్ల డాలర్ల మేర పెరిగి,18,700 కోట్ల డాలర్లకు ఎగబాకింది.. దీంతో ఆయన బేర్నార్డ్ ఆర్నో ను వెనక్కి నటి నెంబర్ వన్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. గడచిన కొన్ని రోజులుగా టెస్లా షేర్లు భారీగా పుంజుకున్నాయి. దీంతో మస్క్ ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మస్క్ ఆస్తి 5,010 కోట్ల డాలర్లు పెరిగింది. కాగా, లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీ గ్రూప్ ఎల్ వి ఎం హెచ్ యజమాని బెర్నార్డ్ 18,500 కోట్ల డాలర్ల సంపదతో కుబేరుల జాబితాలో రెండవ స్థానానికి పరిమితమయ్యారు. అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ( 11,700 కోట్ల డాలర్లు), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (11,400 కోట్ల డాలర్లు), బెర్క్ షైర్ హాత్ వే చైర్మన్ వారెన్ బఫెట్ (10, 600 కోట్ల డాలర్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ళు భారీగా పెరిగాయి. మరోవైపు యూరోజోన్ లో కూడా కార్ల కొనుగోళ్ళు జోరందుకున్నాయి. దీంతో టెస్లా కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి . దీంతో మస్క్ సంపద భారీ పెరుగుదల నమోదు చేసింది. దీంతో అతడి ఆదాయం గణనీయంగా పెరిగింది.. ట్విట్టర్ ఆదాయం పడిపోతున్నప్పటికీ అది మస్క్ ర్యాంకును ప్రభావితం చేయలేకపోయింది.. దీంతోపాటు ఆఫ్రికా దేశాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరుగుతున్న నేపథ్యంలో మస్క్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది.. మరో వైపు ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటును సవరించిన నేపథ్యంలో విదేశీ మదుపుదారులు మస్క్ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు.. దీంతో అతడి ఆదాయంలో భారీ పెరుగుదల నమోదయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ టాప్ టెన్ లో ఏకైక భారతీయుడుగా నిలిచారు.. 8,110 కోట్ల డాలర్ల నెట్ వర్త్ తో ఆయన పదో స్థానంలో ఉన్నారు.. కాగా, హిండెన్ బర్గ్ నివేదిక దెబ్బకు భారీగా సంపద కోల్పోయిన గౌతమ్ అదానీ 32వ స్థానానికి జారుకున్నారు. ఆస్తి మరో 218 కోట్ల డాలర్ల మేరకు తగ్గి 3, 770 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాదిలో అత్యధిక సంప్రద నష్టపోయిన బిలియనీర్ ఆదానీయే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆయన 8,280 కోట్ల డాలర్ల ఆస్తి కోల్పోయారు.