Electricity Charges Hike: మోడీ సార్ యేనా పెంచేది.. ఏ నేను పెంచలేనా? అని అనుకున్నాడేమో కానీ కేసీఆర్ సార్ కూడా బాదుడు మొదలుపెట్టేశాడు. కానీ కొంచెం తెలివిగా ప్రజలకు ‘షాక్’ ఇవ్వబోతున్నాడు. తగ్గేదేలే అంటూనే పెంచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. చార్జీల పెంపుపై కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. తాజాగా విద్యుత్ చార్జీల పెంపునకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) పచ్చజెండా ఊపింది. విద్యుత్ చార్జీలను 14 శాతం పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ విద్యుత్ యూనిట్‌పై 40 నుంచి 50 పైసలు పెంచారు. ఇక ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెంచారు. చార్జీలను 19 శాతం పెంచుకునేందుకు వీలు కల్పించాలని ఈఆర్సీకి డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. అయితే చార్జీలను 14 శాతం మేర పెంచుకునేందుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దాదాపు ఏడేళ్ల తర్వాత విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇచ్చాయి. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ భారమంతా ప్రజలపైనే పడనుంది.
Also Read: India Russia Relations: రష్యాను నమ్ముకుని ఒంటరి కానున్న భారత్?
-బొగ్గు, రవాణా చార్జీలు పెరగడంతో..
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక వర్గాలకు విద్యుత్ సబ్సిడీ అందుతోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఇక రైతులకు అందించే ఉచిత విద్యుత్‌లో భాగంగా 25 లక్షల పంపుసెట్లకు విద్యుత్ సరఫరా అవుతోంది. సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండటంతోపాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు రూ.2 సబ్సిడీ ఉంది. అయితే రైల్వే చార్జీలు, బొగ్గు, రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంచక తప్పలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వేల కోట్ల రూపాయల నష్టాల్లో డిస్కంలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్ అంధకారమవుతుందని, విద్యుత్ చార్జీలు పెంచక తప్పదని ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపించాయి. దీంతో 14 శాతం పెంపునకు అనుమతి మంజూరు చేసింది.
-మన రాష్ట్రంలోనే తక్కువట..
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ ఇటీవల జరిగింది. ఇందులో టీఎస్‌ఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పాల్గొని డిస్కంల నష్టాల గురించి వివరించారు. గృహ అవసరాలకు కూడా కరెంటు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చార్జీల పెంపును ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించే ముందు ఇతర రాష్ట్రాలతో కరెంట్ చార్జీలను పోల్చి చూశామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో కరెంట్ చార్జీలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు.
Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ.. భజన చేసుకోవాలన్న స్పీకర్