Telangana Assembly Elections: తెలంగాణలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్న వేళ.. ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు చేరికలు పెరుగుతున్న వేళ.. ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలకు ముందు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. వీటికి తగ్గట్టుగానే కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలు ఇచ్చింది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. అక్టోబర్ 10న తెలంగాణ అసెంబ్లీ కి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. చీఫ్ సెక్రటరీ, డిజిపి, కలెక్టర్లతో సమావేశమై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
అక్టోబర్లో నోటిఫికేషన్?
తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో ఎన్నికలు ఉంటాయని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ఎన్నికల సమయంలో హడావిడిగా కాకుండా ముందుగానే వ్యవహారాలను మొత్తం చక్కదిద్దుకుంటున్నాయి. వరుసగా సభలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్నాయి. జనాలను కూడా తమ వైపు తిప్పుకునేలాగా ఎన్నికల మేనిఫెస్టోను చూ చాయగా ప్రకటిస్తున్నాయి.. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలో వెలుపడే అవకాశం ఉంది. 2024 జనవరి 16 తో అసెంబ్లీ గడువు ముగియనుంది. అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరితే అక్టోబర్ 10న నోటిఫికేషన్ విలువడే అవకాశం ఉంది. 2018లో శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా నవంబర్ 10వ తేదీన నోటిఫికేషన్ వెల్లడించింది. అదేవిధంగా ఈసారి నెలరోజుల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
వచ్చే ఏడాది జనవరి 16 తో ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే మరో మూడు నెలల్లో అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదలవుతుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ అక్టోబర్లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తే ప్రస్తుతం ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆపద్దర్మ ప్రభుత్వంగా మారిపోతుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రమే ప్రభుత్వానికి ఉంటుంది. అధికారులకు విపరీతమైన పవర్ వస్తుంది. ప్రభుత్వం నామమాత్రం అయిపోతుంది కాబట్టి.. ఇప్పుడే అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తోంది. తనకు అనుకూలమైన అధికారులను జిల్లాల్లో నియమించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది.. ఇటీవల సిఎస్తో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు భేటీ అయిన నేపథ్యంలో.. పలు సూచనలు చేసింది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ముఖ్యమంత్రి బదిలీ అధికారుల జాబితాను చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి తెప్పించుకున్నారు. త్వరలోనే పలు జిల్లాలకు సంబంధించిన కీలక అధికారులను బదిలీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వేకెన్సీ రిజర్వ్ లో ఉన్న కొంతమంది అధికారులకు కీలక పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.