CM Jagan: ఏపీ సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటివరకు 60 మంది వరకు అభ్యర్థులను మార్చారు. అయితే ఇలా మారుస్తున్న అభ్యర్థుల్లో ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 21 మందిని మార్చారు. నాలుగు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకరికి స్థానచలనం కల్పించారు. ఇంకా ఎనిమిది నియోజకవర్గాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలకు మేము బాధ్యులమా? మమ్మల్ని బలి పశువులు చేయడం ఏమిటని ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాహటంగానే జగన్ తీరును తప్పు పడుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా తమను డమ్మీలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దాదాపు రాయలసీమలోని రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎమ్మెల్యేలకు సమాంతరంగా ఇన్చార్జిలను నియమించారు. పేరుకే ఎమ్మెల్యేలు కానీ పెత్తనమంతా ఇన్చార్జిలదే. ఇప్పుడు మీ పనితీరు బాగా లేదంటూ ఎస్సీ ఎమ్మెల్యేలను మార్చుతుండడం పై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీరును తప్పు పడుతున్నారు.
తొలి జాబితాలో ఇద్దరు ఎస్సీ మంత్రులు, ఓ ఎమ్మెల్యే కు స్థానచలనం కల్పించారు. ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆదిమూలపు సురేష్ ను కొండేపి కి పంపించారు. ఎర్రగొండపాలెం లో తాటిపర్తి చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు. మంత్రి మేరుగ నాగార్జునకు సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో సీటు మార్చేశారు. రెండో జాబితాలో పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు టికెట్ నిరాకరించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావును సైడ్ చేసి.. విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు రంగంలోకి దించారు. మూడో జాబితాలో చింతలపూడి సిటింగ్ ఎమ్మెల్యే ఎలీజా కు టికెట్ నిరాకరించారు. కంభం విజయ రాజుకు అవకాశం కల్పించారు. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండి చేయి చూపారు.. ఆయన స్థానంలో మూతిరేవుల సునీల్ కుమార్ అవకాశం ఇచ్చారు. కోడమారు ఎమ్మెల్యే సుధాకర్ కు టికెట్ ఇవ్వని జగన్ అక్కడ డాక్టర్ సతీష్ ను ఎంపిక చేశారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన పనితీరు బాగాలేదని చెప్పి టిక్కెట్ నిరాకరించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కు ఈసారి టిక్కెట్ లేదని తేల్చేశారు. ఆయన స్థానంలో తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మద్దెల గురుమూర్తికి అవకాశం ఇచ్చారు. తిరుపతి ఎంపీ సీటును ఆదిమూలంకు కేటాయించారు. కానీ ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు.
నాలుగో జాబితాలో నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ధర్ ను మార్చేశారు. ఆ స్థానంలో డాక్టర్ సుధీర్ ను నియమించారు. మడకశిర ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామిని తప్పించి ఈర లక్కప్పకు అవకాశం కల్పించారు. ఇలా ఎస్సీ ఎమ్మెల్యేలకు జగన్ ఒక ఆట ఆడుకున్నారు. కొందరికి మొండి చేయి చూపగా.. మరికొందరికి ఇష్టం లేకున్నా స్థానచలనం కల్పించారు. అమలాపురం, రాజోలు, నందిగామ, బద్వేలు, పార్వతీపురం, పామర్రు, సూళ్లూరుపేట, రైల్వే కోడూరు తదితర ఎస్సీ రిజర్వుడ్ని నియోజకవర్గాల్లో ఇంకా మార్పులు జరగలేదు. అక్కడ సైతం చాలామంది అభ్యర్థులను మార్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దళిత ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత ఉందా? వారి పనితీరు మాత్రమే బాగాలేదా?మిగతా వర్గ ఎమ్మెల్యేలు బాగానే పని చేస్తున్నారా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ వైపు ఎస్సీల అనుమానపు చూపులకు ఈ మార్పులు ఒక కారణమవుతున్నాయి. దీనిని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.