ED entry into Al-Falah: అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఊహించిన విధంగానే మనదేశంలో దాక్కుని.. మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్న వైట్ కాలర్ టెర్రరిజాన్ని రూపుమాపే విధంగా మన దేశ పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు.. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.. ఢిల్లీ కారు పేలుడు జరిగిన తర్వాత.. దానికంటే ముందు టెర్రరిస్ట్ మాడ్యూల్ తెలిసిన తర్వాత.. అన్ని వేళ్ళు మొత్తం అల్ – ఫలాహ్ యూనివర్సిటీ వైపు చూపిస్తున్నాయి.. దానికి తగ్గట్టుగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.. తవ్వడం మొదలుపెట్టింది..
అల్ – ఫలాహ్ యూనివర్సిటీ ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఫరీదాబాద్ ప్రాంతంలో ఉంది.. యూనివర్సిటీలో పనిచేస్తున్న వైద్యులు వైట్ కాలర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారు.. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.. అయితే ఈ వ్యవహారంలో తీగంత లాగితే డొంక మొత్తం కదులుతోంది.. అల్ – ఫలాహ్ యూనివర్సిటీ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధికి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఒక్కసారిగా దిగ్బ్రాంతి చెందుతున్నారు. అల్ – ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధికి మధ్యప్రదేశ్ లో జన్మించారు. ఈయన గతంలో 9 విద్యాసంస్థలు నడిపించారు. అందులోకి వివిధ విదేశీ సంస్థలు నిధులు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2019 వరకు ఈ విద్యా సంస్థలను ఆయన అన్నిటిని మూసివేశారు. మోసం చేయడం, నకిలీ పత్రాల సృష్టించడం, నిధులు మళ్లించడం వంటి అనేక రకాలైన ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి.
7.5 కోట్ల చీటింగ్ కేసులో కూడా మూడు సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించారు. దీంతో యూనివర్సిటీకి వచ్చిన నిధులపై కేంద్ర దర్యాప్తు సంస్థ లోతుగా పరిశోధన చేస్తోంది. ఫరీదాబాద్ టెర్రరిస్ట్ మాడ్యూల్ లో ఇతడిది కీలక పాత్ర అని పోలీసులు భావిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన ఖాతాలను పరిశీలిస్తున్నారు. మొత్తంగా చూస్తే అల్ – ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా భారత్ లో దాడులకు కుట్ర పన్నారని తెలుస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు దొరికిన ఉగ్రవాదులు మొత్తం ఈ యూనివర్సిటీలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. వారంతా కూడా భారీగా పేలుడు సామాగ్రిని యూనివర్సిటీ లాకర్లలో భద్రపరిచారు. వివిధ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు కుట్రలు పన్నారు. ఢిల్లీలో మెట్రో సమీపంలో జరిపిన పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు కూడా ఈ యూనివర్సిటీ నుంచి వచ్చాయని కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.