ED Raids On Private Medical Colleges: భూములనే కాదు మెడికల్ సీట్లను కూడా భారత రాష్ట్ర సమితి నాయకులు వదలడం లేదు. అధికారం చేతిలో ఉండడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అడ్డగోలుగా దందా కొనసాగిస్తూ కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వం కండ్లు మూసుకోవడంతో వైద్య విద్యను అభ్యసించాలంటే కోట్లకు కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. మేనేజ్మెంట్ కోటాను అడ్డుపెట్టుకొని విద్యార్థుల దగ్గర్నుంచి కోట్లను వసూలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు, వాటిని ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. అలా దక్కిన అధికారాన్ని చేతిలో పెట్టుకొని మరిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి..
ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం నుంచి దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వారు జరిపిన సోదాల్లో మేనేజ్మెంట్ కోట సీట్ల భర్తీలో వందల కోట్ల రూపాయల మేర మనీ లాండరింగ్ కోణంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో కీలక ఆధారాలు సేకరించారు. వైద్య కళాశాలలతో పాటు, వాటి యాజమాన్యాల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 18 బృందాలుగా విడిపోయిన అధికారులు గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, కరీం నగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిపిన దాడుల్లో మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కి చెందిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ దాడుల సందర్భంగా ఈడి అధికారులు సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా కాలేజీల సిబ్బంది సెల్ ఫోన్ లను సీజ్ చేశారు.
అధికార పార్టీ నాయకుల కాలేజీల్లో..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కి చెందిన మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ తో పాటు భాస్కర వైద్య కళాశాలలో దాడులు కొనసాగుతున్నాయి. ఇక్కడి రికార్డు గదిలోని డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆస్పత్రి, వైద్య కళాశాలలో పనిచేసే సిబ్బందిని విచారిస్తున్నారు. అడ్మిషన్లు ఎలా జరుగుతున్నాయి? మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎలా భర్తీ చేస్తున్నారు? అనే విషయాల మీద కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఘనపూర్ పరిధిలో ఉన్న మెడిసిటీ వైద్య కళాశాల, ఎం ఐ ఎం చీఫ్ అసదుద్దీన్, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నిర్వహించే దక్కన్ మెడికల్ కాలేజీ, మంత్రి మల్లారెడ్డి కి చెందిన మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన ఖమ్మంలోని మమత ఎడ్యుకేషనల్ సోసైటీలో అధికారుల సోదాలు కూడా మొదలయ్యాయి. మమత మెడికల్ కాలేజీలో గడిచిన ఐదు సంవత్సరాలుగా పీజీ సీట్ల కేటాయింపు, మేనేజ్మెంట్, ఎన్నారై కోటా, నీట్ కోటా లో సీట్ల భర్తీ వివరాలను సేకరించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈడి అధికారులు మంత్రి అజయ్ని సంప్రదించి తమకు కావలసిన సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. అనేని ఆసుపత్రుల గ్రూపునకు సంబంధించి హైదరాబాద్, నార్కట్ పల్లి లో తనిఖీలు జరిగాయి. హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో సుమారు 12 గంటల పాటు తనిఖీలు జరిగాయి. కామినేని ఆసుపత్రి చైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులోని ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీ, కరీంనగర్ లోని ప్రతిమ, చల్మెడ వైద్య కళాశాలలో, మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాటి యాజమాన్యాల గృహాల్లోనూ తనిఖీలు చేపడుతున్నారు. లాప్ టాప్, పెన్ డ్రైవ్ వంటి సాంకేతిక ఆధారాలు ఫీడ్ చేశారు.
ప్రణాళిక ప్రకారం బ్లాక్ చేశారు
ఇక ఈ మొత్తం వ్యవహారంలో ప్రైవేటు వైద్య కళాశాలలో ఒక ప్రణాళిక ప్రకారం సీట్లు మొత్తం బ్లాక్ చేశారని ఈడి అధికారులు గుర్తించారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు చెందిన మెడికల్ కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేసి కోట్లల్లో విక్రయించాలని ఈడి అధికారుల సోదాల్లో బయటపడింది. గతంలో మల్లారెడ్డి కాలేజీలో ఈ తరహా ఆరోపణలతోనే సోదాలు జరిగాయి. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ లో పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా ఈడీ అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే తాజా దాడులు నిర్వహించామని అధికారులు అంటున్నారు. ఇక కోవిడ్ సమయంలో బృహన్ ముంబై కార్పొరేషన్ కి హైదరాబాద్ ఆస్పత్రుల నుంచి పెద్ద మొత్తంలో కిట్లు సరఫరా అయ్యాయి. ఈ వ్యవహారంలో అక్రమాలు చేసినట్టు ఈడి అధికారులు గుర్తించారు. ఇటీవల దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో.. ప్రస్తుత తనిఖీల్లో భాగంగా బీఎంసీ స్కాం సమాచారాన్ని కూడా ఈడి అధికారులు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి.